సహజ వనరుల సంరక్షణే బతుకమ్మకు సంరక్షణ

సహజ వనరుల సంరక్షణే బతుకమ్మకు సంరక్షణ

జనగాం జిల్లా: సహజ వనరుల పరిరక్షణే బతుకమ్మకు సంరక్షణ అని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క అన్నారు. మంగళవారం జిల్లాలోని పాలకుర్తి మండలం మంచుప్పుల గ్రామంలో బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి విమలక్క ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ ఆట ఆడారు. ప్రకృతి సృష్టే బతుకమ్మ అని, ప్రకృతిని కాపాడుకుంటేనే బతుకమ్మ మనుగడ ఉంటుందని స్పష్టం చేశారు. బతుకమ్మకు కులంతో సంబంధం లేదని, శ్రమ జీవుల బతుకమ్మ అని స్పష్టం చేశారు. సామాజిక అసమానతలు తొలగించేందుకు, కులాన్ని నిర్మూలించేందుకు బహుజన బతుకమ్మ కార్యక్రమం చేస్తున్నామని విమలక్క చెప్పారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతవనిలో వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సమయాల్లో కూడా దళితులపై తీవ్రమైన వివక్ష కొనసాగుతోందని, చాలా గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి ఉందని ఆమె అన్నారు.

పరువు పేరుతో హత్యలు చేస్తున్నారని, హత్యలు చేస్తే పరువు ఎలా నిలబడుతుందని ప్రశ్నించారు. ప్రేమ వివాహాల్ని అంగీకరించలేని పరిస్థితి ఏర్పడిందని, పరువు పేరుతో చేసే దారుణాలను ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. ఆడపిల్లలను పుట్టనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం అంటూ పిలుపునిచ్చారు. గ్రామంలోని దళితుల భూ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా, నాయకులు సారయ్య, రైతు  బత్తుల సత్తయ్య,  సోమసత్యం, నాగన్న, మధుసూదన్, పద్మ, వెంకటేశ్వర్లు, ప్రజా సంఘాల నాయకులు బాణాల వెంకన్న, రేణుక, తదితరులు పాల్గొన్నారు.