వెల్దండ టీఆర్‌‌ఎస్‌ లీడర్ల  రాజీనామాలపై హైకమాండ్​ ఆరా

వెల్దండ టీఆర్‌‌ఎస్‌ లీడర్ల  రాజీనామాలపై హైకమాండ్​ ఆరా

నాగర్​కర్నూల్, ​వెలుగు: కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్​కమిటీ చైర్మన్​ఎంపిక, కేఎల్ఐ డి82 కాలువ రైతుల పరిహారం, గ్రామాల్లో సమస్యలు,అభివృద్ధి పనులు, పార్టీలో తమకు గుర్తింపు తదితర అంశాలపై రెండు రోజుల్లో స్పందన రాకుంటే ప్రగతిభవన్​కు పాదయాత్ర నిర్వహిస్తామని వెల్దండ టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. మరోవైపు మండలంలో సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షుల మూకుమ్మడి రాజీనామాలపై పార్టీ హైకమాండ్​ ఆరా తీసింది. పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ ఇంటెలిజెన్స్​ నుంచి వివరాలు కోరినట్లు సమాచారం. ఆదివారం వెల్దండ మండల కేంద్రానికి సమీపంలో నిర్వహించిన సమావేశానికి సింగిల్​విండో వైస్​చైర్మన్​సంజీవ్​యాదవ్​అధ్యక్షత వహించారు. శనివారం రాజీనామాలు ఇచ్చిన ఎంపీపీ, వైఎస్​ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, పార్టీ గ్రామ  అధ్యక్షులు, ముఖ్యనేతలు హాజరయ్యారు.

సమావేశంలో మాట్లాడిన సర్పంచులు, నేతలు తమకు కనీస గుర్తింపు లేదని వాపోయారు. అధికార పార్టీలో ఉంటూ గ్రామ సమస్యలపై ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదన్నారు. కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్​కమిటీ చైర్మన్​ఎంపిక విషయంలో పార్టీ మండల అధ్యక్షుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. విధిలేక తాము ప్రగతిభవన్ పాదయాత్ర పెట్టుకున్నామని ప్రకటించారు. తామంతా పార్టీలోనే ఉంటామని, పార్టీ కోసం పనిచేస్తామని అంటూనే సంజీవ్​యాదవ్​కు న్యాయం జరగాలని డిమాండ్​ చేశారు. ​సంజీవ్​యాదవ్​మాట్లాడుతూ అన్ని వర్గాలు, రంగాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంటే కల్వకుర్తిలో సొంత పార్టీలో తాము వివక్షకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన  గిరిజన గ్రామ పంచాయతీల్లో అనేక సమస్యలున్నాయన్నారు. అదనంగా పింఛన్లు, మండలానికి వెయ్యి ఇండ్లు, అవసరమైన లింక్ రోడ్లు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రెండు రోజుల వరకు చూస్తామని, సరైన స్పందన రాకపోతే 21న కల్వకుర్తి పట్టణంలోని అంబేద్కర్​ విగ్రహం నుంచి ప్రగతిభవన్​ వరకు పాదయాత్ర నిర్వహించి సీఎం కేసీఆర్​కు తమ సమస్యలు చెప్పుకొంటామన్నారు. 

రాజీ యత్నాలు

పార్టీ మండల అధ్యక్షుడు, వెల్దండ సర్పంచ్​ యెన్నం భూపతిరెడ్డి, సీనియర్​లీడర్ జూపల్లి బాలేమియా, కల్వకుర్తి వైఎస్​ఎంపీపీ గోవర్ధన్ తదితరులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. పార్టీలో అభిప్రాయ భేదాలు సహజమని, సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకుందామన్నారు. రోడ్డున పడి మనం గెలిపించుకున్న ఎమ్మెల్యేను మనమే విమర్శించడం మంచిది కాదంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రెండు రోజుల్లో ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​ముఖ్యనేతలతో సమావేశమవుతారని, అందులో అందరూ వారి సమస్యలు, ఇబ్బందులు చెప్పుకోవచ్చని భూపతిరెడ్డి సూచించారు.