న్యూఢిల్లీ: సింగపూర్‌కు చెందిన అతి పెద్ద టెలికాం ప్రొవైడర్ సింగ్టెల్, భారతీ ఎయిర్టెల్లో తనకున్న వాటాలో 0.8 శాతాన్ని అమ్మింది. దీంతో కంపెనీకి రూ. 10,353 కోట్లు సమకూరాయి. ఇన్‌స్టిట్యూషనల్ పెట్టుబడిదారులకు ప్రైవేట్ ప్లేస్‌మెంట్ మార్గంలో ఈ వాటా విక్రయం జరిగింది. ఈ డీల్ నుంచి సుమారు 1.1 బిలియన్ సింగపూర్డాలర్ల లాభం వస్తుందని సింగ్టెల్ అంచనా వేసింది. సింగ్టెల్ అనుబంధ సంస్థ పాస్టెల్ లిమిటెడ్, ఎన్ఎస్ఈ స్క్రీన్ -బేస్డ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లో 51 మిలియన్ల భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్ (బీఏఎల్) షేర్లను విక్రయించింది.
ఒక్కో షేరును రూ. 2,030 ధరకు అమ్మింది. ఈ వాటా విక్రయం తరువాత, సింగటెల్కు ఎయిర్టెల్లో 27.5 శాతం వాటా మిగిలింది. దీని విలువ సుమారు దాదాపు రూ. 3.46 లక్షల కోట్లు. సింగటెల్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆర్థర్ లాంగ్ మాట్లాడుతూ, ఈ నిధులను బ్యాలెన్స్ షీట్ బలోపేతం చేయడానికి, డిజిటల్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ సేవల్లో వృద్ధి అవకాశాల కోసం పెట్టుబడి పెట్టడానికి ఉపయోగిస్తామని వివరించారు.
