
పాట్నా: బిహార్‌లో నిర్వహించిన ఓటరు జాబితా సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అనేది ఓటు చోరీకి కొత్త ఆయుధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమేననే సూత్రంతో ఈ చోరీని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సాసారామ్‌లో ప్రారంభమైన 'వోటర్ అధికార్ యాత్ర' సందర్భంగా కొందరు ఓటర్లతో మాట్లాడిన విషయాలను ఆయన తన వాట్సాప్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు.
"ఎస్ఐఆర్ అనేది ఓటు చోరీకి కొత్త ఆయుధం. నాతో ఈ ఫొటోలో నిలబడిన వ్యక్తులంతా ఓట్ చోరీ జరిగిందనటానికి రుజువులు. వారంతా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేశారు. కానీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి ఓటు లేకుండా పోయింది. వారి గుర్తింపును లిస్టు నుంచి తుడిచేశారు" అని పేర్కొన్నారు. రాజ్ మోహన్ సింగ్(70) రైతు, రిటైర్డ్ సైనికుడని.. అలాగే, ఉమ్రావతి దేవి (దళిత, కూలీ), ధన్‌జయ్ కుమార్ బింద్ (వెనుకబడిన తరగతి, కూలీ), సీతా దేవి (ఉపాధి కూలీ),- రాజు దేవి ( కూలీ), మొహ్ముద్దీన్ అన్సారీ (కూలీ) పేర్లను ఈసీ ఓట్ల జాబితా నుంచి అకారణంగా తొలగించిందని వివరించారు.
అధికార బీజేపీ, ఎన్నికల సంఘం (ఈసీ) కలిసి బహుజనులు, పేదలను శిక్షిస్తున్నాయని.. సైనికులను కూడా విడిచిపెట్టలేదని రాహుల్ ఆరోపించారు. సామాజిక వివక్ష, ఆర్థిక పరిస్థితుల కారణంగా వారు వ్యవస్థ కుట్రలను ఎదుర్కొలేకపోతున్నారని చెప్పారు. అందుకే తాము వారి తరఫున 'ఒక వ్యక్తి, ఒక ఓటు' పేరుతో యాత్ర చేపట్టామన్నారు.