వనపర్తి, వెలుగు : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ ద్వారా జిల్లాలో పాత జాబితాను రద్దు చేసి, పూర్తిగా నూతన ఓటరు జాబితాను రూపొందించనున్నట్లు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ అడ్జంక్షన్-3 ఫారం పూరించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. 1987 కంటే ముందు జన్మించిన వారు, 1987-–2004 మధ్య, 2004 తర్వాత జన్మించిన వారు నిబంధనల ప్రకారం తమ సొంత లేదా తల్లిదండ్రుల పుట్టిన తేదీ, పుట్టిన స్థలం ఆధారాలను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఓటరు నమోదులో పొరపాట్లు లేకుండా ఉండేందుకు ప్రతి రాజకీయ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని, వారు బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకుంటూ కొత్త జాబితా తయారీలో భాగస్వాములు కావాలని సూచించారు.
