కరోనాకు గురిపెట్టిన సిరిసిల్ల అలారమ్

కరోనాకు గురిపెట్టిన సిరిసిల్ల అలారమ్

సిరిసిల్ల టౌన్​, వెలుగు: రోనా నుంచి రక్షించుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా  కొన్నిసార్లు మర్చిపోయి పొరపాట్లు చేస్తుంటారు. అందుకే ఎప్పటికప్పుడు ఎలర్ట్‌‌ చేయడానికి ఈ పరికరాలు తయారు చేశారు బుధవారపు శ్వేత, స్నేహ. వాళ్ల ఊరు రాజన్న సిరిసిల్ల. శ్వేత ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చదువుతోంది. స్నేహ బీఎస్సీ స్టూడెంట్. ఇద్దరూ కరోనాని అరికట్టేందుకు  ఏదైనా చేయాలనుకున్నారు. ఎంతో కష్టపడి ఈ డివైజ్‌‌లు తయారు చేశారు.

అలారం వాచ్

కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వీలైనంత వరకు చేతులతో ముఖాన్ని తాకకుండా ఉండాలి. కానీ.. కొందరి చెయ్యి పదే పదే ముఖం మీదకు పోతుంటుంది. ఈ సిస్టర్స్‌‌ తయారుచేసిన వాచ్‌‌ పెట్టుకుంటే.. చెయ్యి ముఖం మీదకి వెళ్లే లోపే అలారమ్​ మోగుతుంది. మరిచిపోయి ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇద్దామని చేయి చాపినా అలారమ్​ మోగుతుంది. దీన్ని ఒక చిన్న బ్యాటరీ, స్విచ్, బాల్ సెన్సర్‌‌‌‌, బజర్‌‌‌‌తో తయారు చేశారు. దీన్ని తయారు చేయడానికి అయిన ఖర్చు కేవలం వంద రూపాయలు.

ఫిజికల్‌‌ డిస్టెన్స్‌‌ డివైజ్‌‌

ఫిజికల్‌‌ డిస్టెన్స్‌‌ పాటించకుండా జనాలు రోడ్లపైకి వస్తున్నారని.. ప్రతి రోజు వార్తల్లో వస్తూనే ఉంది. అలాంటి వాళ్లందరికీ ఈ సిస్టర్స్‌‌ తయారుచేసిన డివైజ్‌‌ మెడలో వేస్తే సరి. ఇది చూడ్డానికి ఐడీకార్డులా ఉంటుంది. మనకు దగ్గరగా ఎవరైనా వస్తే వెంటనే అలారం మోగుతుంది. దీన్ని తయారుచేయడానికి ఐఆర్ సెన్సర్‌‌‌‌, బజర్, స్విచ్, బ్యాటరీ క్లిప్‌‌ వాడారు.

శానిటైజర్‌‌‌‌ బకెట్

ఎవరైనా ఇంటి గేటు ముందుకు రాగానే.. ఈ బకెట్‌‌ చేతులు శుభ్రం చేసుకోమని అలర్ట్‌‌ చేస్తుంది. బకెట్ ముందు చేతులు పెట్టగానే చేతిలో శానిటైజర్‌‌‌‌ పడుతుంది.

నాన్నే స్ఫూర్తి

మా నాన్న మల్లేశమే మాకు స్ఫూర్తి. ఆయన ఇలాంటి వస్తువులను ఎన్నో తయారు చేశారు. ఆయన చొరవతో మేం కూడా ఏదైనా చేయాలని ఇవి ట్రై చేశాం. కరోనా నుంచి కాపాడుకునేందుకు ఇవి చాలావరకు పనిచేస్తాయి. అందరూ మమ్మల్ని మెచ్చు కుంటుంటే.. చాలా సంతోషంగా ఉంది.

– స్నేహ, శ్వేత

మన సోషల్ లైఫ్ మారిపోతుందా?