గుండెలు పిండేసిన ఘటన : చనిపోయిన అన్నయ్య చేతికి రాఖీ కట్టిన చెల్లెలు

గుండెలు పిండేసిన ఘటన : చనిపోయిన అన్నయ్య చేతికి రాఖీ కట్టిన చెల్లెలు

అన్నా.. అన్నా.. ఒక్కసారి లేయరాదే.. చూడవే చెల్లెమ్మ వచ్చింది.. రాఖీ కట్టించుకో అన్నా.. నా కోసం ఒక్కసారి లేయరాదే.. అన్న మృతదేహం దగ్గర ఆ చెల్లెలు ఆర్తనాదాలు ఊరంతా కదిలించింది. మరికొన్ని గంటల్లో రాఖీ పండుగ.. ఆనందంగా.. పుట్టింటికి బయలుదేరిన చెల్లెలుకు ఊహించని కబురు వచ్చింది. మీ అన్న లేడమ్మా అని.. ఈ హృదయ విధారకరమైన ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్ట గ్రామంలో ఆగస్ట్ 30వ తేదీ జరిగింది. వివరాల్లోకి వెళితే..

దూళికట్ట గ్రామానికి చెందిన కనకయ్య అర్థరాత్రి గుండెపోటుతో చనిపోయాడు. ఆగస్ట్ 29వ తేదీ మంగళవారం ఎప్పట్లాగే భోజనం చేసి పడుకున్న కనకయ్య.. 30వ తేదీ బుధవారం ఉదయం తీవ్ర గుండెపోటుతో ఇంట్లోనే కన్నుమూశాడు. షాక్ అయిన కుటుంబ సభ్యులు.. అందరికీ సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే రాఖీ పండక్కి అన్నయ్యకు రాఖీ కట్టటానికి బయలుదేరిన కనకయ్య చెల్లెలు గౌరక్కకు ఈ సమాచారం తెలిసింది. 

ALSO READ : తుమ్మల ఇంట్లో కీలక సమావేశం.. కాంగ్రెస్లోకి వెళ్తారా..?

విషయం తెలిసి వెంటనే అన్నయ్య ఇంటికి వచ్చిన గౌరక్క.. విగతజీవిగా పడి ఉన్న అన్నయ్యను చూసి తట్టుకోలేకపోయింది. అన్నా.. నీ రక్ష కోసం రాఖీ కొన్నానే.. ఒక్కసారి లేచి రాఖీ కట్టించుకో అంటూ బోరున విలపించింది. ఎంతో ప్రేమగా తెచ్చిన రాఖీని.. చనిపోయిన అన్నయ్య చేతికి కట్టి తన రుణం తీర్చుకుంది. వేడుకగా జరగాల్సిన పండగను.. ఇలా విషాధంగా జరగటాన్ని చూసి ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంది. చనిపోయిన అన్నయ్య చేతికి రాఖీ కడుతున్న సమయంలో ఉద్విగ్నభరిత వాతావరణ నెలకొంది. అందరూ కన్నీటిపర్యంతం అయ్యారు. 

ఎంతో ఆరోగ్యంగా ఉండే కనకయ్య.. ఒక్కసారిగా గుండెపోటుతో చనిపోవటం.. చనిపోయిన అన్నయ్య చేతికి రాఖీ కట్టటం మరింత విషాధానికి దారితీసింది.