తుమ్మల ఇంట్లో కీలక సమావేశం.. కాంగ్రెస్లోకి వెళ్తారా..?

తుమ్మల ఇంట్లో కీలక సమావేశం.. కాంగ్రెస్లోకి వెళ్తారా..?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దారెటు అనే చర్చ ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. పాలేరు టికెట్ ఆశించిన తుమ్మలకు బీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో అధిష్టానంపై ఆయన గుర్రుగా ఉన్నారు. పాలేరు టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి ఇవ్వడంతో ఈ మధ్యే తన అనుచరులతో కలిసి బల ప్రదర్శన కూడా నిర్వహించారు తుమ్మల. గత వారం రోజులుగా వేచి చూసే ధోరణిలో ఉన్న.. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారా..? లేక బీజేపీకి వెళ్తారా.. అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే.. తుమ్మల కాంగ్రెస్ లోకే వెళ్తారనే ప్రచారం జిల్లా వ్యాప్తంగా మరింత ఊపందుకుంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా తుమ్మలను కలిసేందుకు గండుగలపల్లిలోని ఆయన ఆయన ఇంటికి నాయకులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. తుమ్మల తీసుకునే రాజకీయ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని హామీ ఇస్తున్నారు. కూసుమంచి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, సర్పంచ్ తో పాటు ఇతర నాయకులు మర్యాదపూర్వకంగా బుధవారం (ఆగస్టు 30న) తుమ్మలను కలిశారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వారంతా కోరారు. బుధవారం (ఆగస్టు 30న) ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగలపల్లి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కలిశారు. 

ఇటు తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నాననేలా తనను కలిసిన అనుచరులకు హింట్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం తనకు పాలేరు టికెట్ ఇవ్వకపోవడాన్ని తన జీవితంలోనే ఘోర అవమానంగా భావిస్తున్నట్లు వారి వద్ద తుమ్మల వాపోయినట్లు తెలిసింది.

ALSO READ : సింగపూర్ కు బియ్యం ఎగుమతిపై పచ్చజెండా

ఈ క్రమంలో తుమ్మల బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమేనని ఆయన అనుచరులు అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల మొదటి వారంలో తుమ్మలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. తర్వాత ఢిల్లీ పెద్దల సమక్షంలో చేరిక ఉంటుందని చెప్తున్నారు. సెప్టెంబర్ నెల 6న కాంగ్రెస్‌లో తుమ్మల చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ వాదనకు బలమిస్తూ తుమ్మల అనుచరులు సెప్టెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌కు భారీ సంఖ్యలో వెహికల్స్ బుక్ చేస్తున్నారని తెలుస్తోంది. 

బీఆర్ఎస్ బుజ్జగింపులు? 

మరోవైపు..  తుమ్మలకు రాజ్యసభ సీటుగానీ, ఎమ్మెల్సీ అవకాశంగానీ ఇస్తామని బీఆర్ఎస్ పెద్దలు బుజ్జగిస్తున్నారన్న  ప్రచారం సాగుతోంది. అయితే ఇదంతా నిజం కాదని, ఈ ప్రచారం బీఆర్ఎస్ గేమ్ ప్లాన్‌లో భాగమని తుమ్మల వర్గీయులు కొట్టి పారేస్తున్నారు. తుమ్మల బీఆర్ఎస్‌లో కొనసాగే ఆలోచనతో లేదంటున్నారు. బీఆర్ఎస్ కూడా తుమ్మల పార్టీ మారితే జరిగే నష్టంపై అంచనాలు వేస్తున్నదే తప్ప ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించడం లేదని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్​ఒక్క సీటే గెలిచిందని, ఇప్పుడు అంతకు మించిన నష్టం ఏమీ ఉండదని కేసీఆర్​భావిస్తున్నట్టు చర్చ సాగుతోంది.

ఖమ్మమా? పాలేరా? 

తాను పాలేరు నుంచే పోటీ చేస్తానని తుమ్మల చెబుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ లిస్ట్​ ప్రకటించిన తర్వాత కూడా ఆయన అదే మాటపై ఉన్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరితే ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ ముఖ్య నేతలు ఆయనకు సూచించనున్నట్టు తెలుస్తున్నది. పాలేరు నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలేరు నుంచి పోటీకి పొంగులేటి సిద్ధంగా ఉన్నా, తుమ్మల మాత్రం ఖమ్మం నుంచి పోటీకి రెడీగా లేరని అంటున్నారు. మరోవైపు వైఎస్ఆర్​టీపీ కాంగ్రెస్‌లో విలీనమైతే షర్మిల కూడా పాలేరు సీటు కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. అందుకే తుమ్మలకు ఖమ్మం సీటు ఆఫర్​ చేయడానికి కారణమన్న చర్చ నడుస్తున్నది.