తమ్ముడికి 5 కేజీల లెటర్ రాసిన అక్క

తమ్ముడికి 5 కేజీల లెటర్ రాసిన అక్క

ఓ అక్క తన తమ్ముడికి 5 కేజీల బరువు, 434 మీటర్ల పొడవు ఉత్తరం రాసింది.. ఎవరైనా ఇంత పెద్ద లెటర్ రాస్తారా.. అని షాక్ అవ్వకండి. ఇది చదవండి మీకే అర్ధమౌతుంది. ఈ వింత ఘటన కేరళలో చోటు చేసుకుంది. కృష్ణ ప్రియ, కృష్ణ ప్రసాద్ ఇద్దరూ అక్కా తమ్ముళ్లు. వీరిద్దరు కేరళలో వేరు వేరు కాలేజీల్లో ఇంజినీరింగ్ చదువుతున్నారు, అయితే ఇటీవల వరల్డ్ బ్రదర్స్ డే జరిగిన విషయం తెలిసిందే.. ఆ రోజు తమ్ముడిని కృష్ణప్రియ విష్ చేయడం మర్చిపోయిందట. అయితే వెంటనే తమ్ముడు అక్కకు ఫోన్ ద్వారా మెసేజ్‌లు పంపించాడు.

కానీ అక్క ఏదో పనిలో పడి ఆ మెసేజ్‌లు చూసుకోలేదు. దీంతో తమ్ముడు మనస్తాపానికి గురైయ్యాడు. అక్కను ఫోన్లో, వాట్సాప్‌లో బ్లాక్ చేశాడు. కొంత సేపటికి అక్క పోన్ చూసుకోగా.. తమ్ముడు పంపిన మెస్సెజ్ లు కనిపించాయి. వెంటనే కృష్ణప్రియ తమ్ముడికి ఫోన్ చేసింది, మెసేజ్ చేసింది.. కానీ తమ్ముడి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. తమ్ముడు తనపై అలిగాడని గ్రహించిన అక్క ఎలాగైనా తమ్ముడికి సారీ చెప్పాలనుకుంది. ఆమె ఉత్తరం రాయాలనుకుంది.. వెంటనే దానికి కావాల్సిన పేపర్లు కొని తెచ్చుకుంది. 

అయితే ఒక పేపర్ తో మొదలైన ఆ లెటర్.. ఒకటి, రెండూ, మూడు....అలా బోలెడు పేపర్లు రాసింది. ఆ పేపర్లన్నీ వరుసగా పెట్టి కొలిచి చూడగా దాదాపు 434 మీటర్ల పొడవు వచ్చాయి. ఆ పేపర్లన్నీ తూకం వేయగా 5 కిలోలకు పైగా బరువు తేలాయి. వాటిని తమ్ముడికి పార్శిల్ చేసింది. పోస్టు చేయడానికి చాలా ఇబ్బంది పడింది కృష్ణప్రియ. 12 గంటల పాటు కదలకుండా కూర్చుని రాసిందట. అక్క పంపిన ఆ ఉత్తరాలు చూశాక తమ్ముడి కోపం పోయింది. అంతేకాదు తమ్ముడి కోసం రాసిన ఈ ఉత్తరం త్వరలో గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కనుందాట. మొత్తానికి అక్క తమ్ముడిపై ప్రేమను ఈ విధంగా చూపింది.