
మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసు దేశం మెుత్తాన్ని కొన్ని నెలల కిందట కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ తన భార్య సోనమ్ మేఘాలయలో హనీమూన్ కోసం వెళ్లినప్పుడు హఠాత్తుగా రాజా మాయమైపోయాడు. కొంతకాలం తరువాత అతని శవం ఒక లోతైన చెరువులో కనుగొనబడింది. బాడీపై కత్తిపోట్లతో ఘోరమైన హత్య పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
హత్య కేసు దర్యాప్తు కోసం మేఘాలయ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా 790 పేజీల ఛార్జిషీట్‌ను సోహ్రా సబ్-డివిజన్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించింది. ఈ ఛార్జిషీట్‌లో రాజా రఘువంశీ భార్య సోనమ్ ప్రధాన నిందితురాలిగా తేల్చింది సిట్. ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాతో పాటు ఆకాశ్ రాజ్పుత్, విశాల్ సింగ్ చౌహాన్, ఆనంద్ కుర్మి కలిసి రాజాని హత్య చేసినట్టు సాక్ష్యాలను జతపరిచింది సిట్ బృందం.
►ALSO READ | ఇవి మామూలు చెంప దెబ్బలు కావు.. క్లాస్మేట్ను 90 సెకన్ల పాటు వాయించేసిన లా స్టూడెంట్.. వీడియో వైరల్
హనీమూన్ కి వెళ్లినప్పుడు భర్తను హత్య చేయించటానికి దాదాపు రూ.20 లక్షలు సుపారీగా ఇచ్చినట్లు తేలింది. హత్య జరిగినప్పుడు సోనమ్ అక్కడే ఉండి తన భర్తను హత్య చేయడంలో పాల్గొన్నట్లు ఛార్జ్ షీటులో పేర్కొనబడింది. కేసులో పట్టుబడ్డ తరువాత సోనమ్ మొదట దాక్కుంది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని ఘజీపూర్‌లో స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయింది.
ఈ కేసులో నిందితులపై భారతీయ న్యాయ సంహిత ఆధారంగా హత్య, నేరాలను దాచడం, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. మరో ముగ్గురు సహ నిందితులపై కూడా అనుబంధ ఛార్జిషీట్ దాఖలు కానుంది. ఈ కేసు ఇప్పుడు ట్రయల్ దశకు కొంత దూరంలో ఉంది.