
- మూడు జిల్లాల్లో 9.5 లక్షల ఎకరాలకు నీళ్లు
- సీతారామ లిఫ్ట్‌తో కృష్ణా ఆయకట్టుకు గోదారి జలాలు
- రాజీవ్, ఇందిరాసాగర్‌లను ఒకే ప్రాజెక్ట్‌గా మార్చిన
- గత బీఆర్ఎస్ సర్కార్
- మూడు పంప్‌హౌస్‌లు కట్టి సాగర్ కాలువతో లింక్
- అక్కడి నుంచి వైరా కెనాల్‌కు
- ప్రాజెక్టుకు 67.05 టీఎంసీల జలాల కేటాయింపు
హైదరాబాద్, వెలుగు : సీతారామ ప్రాజెక్ట్‌ను కూడా గత సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టులాగానే రీడిజైన్ చేసి పనులను మొదలు పెట్టింది. ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 లక్షలు, మహబూబాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 4 లక్షల ఎకరాలనూ స్థిరీకరించనున్నారు. గోదారి నీళ్లను కృష్ణా ఆయకట్టుకు తరలించాలన్న ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన రెండు లిఫ్ట్ స్కీమ్ ప్రాజెక్టులను విలీనం చేసి మొదలు పెట్టిన ప్రాజెక్టు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.
ఆ ప్రాజెక్ట్ విశేషాలివీ..
గోదావరి నీళ్లను కృష్ణా ఆయకట్టుకు ఇవ్వాలన్న ఉద్దేశంతో మొదలు పెట్టిన ప్రాజెక్ట్. ఉమ్మడి ఏపీలో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇందిరాసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను ప్రారంభించారు. 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించేలా ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు.అప్పటికి ఆ ప్రాజెక్టుల అంచనా ఖర్చు కేవలం రూ.3,505 కోట్లే.గత సర్కారు ఆ రెండు లిఫ్ట్ స్కీమ్‌లను కటే ప్రాజెక్టుగా రీడిజైన్ చేసింది.
సీతారామ సాగర్ పేరిట నిర్మాణాన్ని మొదలు పెట్టింది. 2018 ఫిబ్రవరి 16న అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.తొలుత రూ.7,926 కోట్లకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనా అనుమతులిచ్చింది. కానీ, 2018లో అంచనాలను సవరించి రూ.13,057.98 కోట్లకు పెంపు.. ఇప్పుడు రూ.18,286 కోట్లకు అమాంతం పెంపు.అందులో భాగంగా సీతమ్మసాగర్ బ్యారేజీని నిర్మించి దాని నుంచి నీళ్లను లిఫ్ట్ చేస్తారు.మూడు పంప్ హౌస్‌ల ద్వారా నీటిని ఆయకట్టుకు తరలిస్తారు. బీజీ కొత్తూరు, పూసుగూడెం, కమలాపురం వద్ద పంప్‌హౌస్‌లను నిర్మించారు. ఒక్కో పంప్‌హౌస్‌లో ఆరు చొప్పున మోటార్లను బిగించారు.
వాటిని గురువారం సీఎం రేవంత్ ప్రారంభించారు.బీజీ కొత్తూరు నుంచి పూసుగూడెం పంప్‌హౌస్‌కు నీళ్లను లిఫ్ట్చేస్తారు. అక్కడి నుంచి కమలాపురం పంప్‌హౌస్‌కు ఎత్తిపోస్తారు. కమలాపురం పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోసిన నీళ్లను కెనాల్ ద్వారా గ్రావిటీతో ఏన్కూరు వద్ద ఎన్ఎస్పీ కెనాల్‌తో లింక్ చేస్తారు. తర్వాత వైరా కెనాల్‌కు తరలించి ఆయకట్టుకు నీళ్లందిస్తారు.ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా ఖమ్మం జిల్లాకు సాగునీరు అందించనున్నారు. సెకండ్ ఫేజ్‌లో భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు సాగు నీరందించనున్నారు.
మొత్తం 8 ప్యాకేజీలుగా లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేశారు. మొత్తం గ్రావిటీ కాలువల పొడవు 249.50 కిలోమీటర్లు.సీతారామ సాగర్ ప్రాజెక్టుకు చేసిన నీటి కేటాయింపులు 67.05 టీఎంసీలు.2026 ఆగస్టు 15 నాటికి సెకండ్ ఫేజ్ పనులనూ పూర్తి చేసి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నారు.నీళ్లు ఎత్తిపోసేందుకు ఈ లిఫ్ట్‌లకు 694 మెగావాట్ల విద్యుత్ ఖర్చు కానుంది. లిఫ్ట్ స్కీమ్‌తో పాటు సీతమ్మసాగర్ బ్యారేజీ ద్వారా ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యమున్న 8 టర్బైన్ల ద్వారా 320 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు.