జీఎస్టీ పేరుతో ఆహార పదార్థాలపై ట్యాక్సులు 

జీఎస్టీ పేరుతో ఆహార పదార్థాలపై ట్యాక్సులు 

కాజీపేట, వెలుగు :  జీఎస్టీ పేరుతో ఆహార పదార్థాలు, ఉత్పత్తులపై ట్యాక్సులు పెంచారని, బ్రిటీష్ పరిపాలన తర్వాత ఫుడ్​ప్రొడక్ట్స్​పై దేశంలో ట్యాక్సులు పెరగడం ఇదే మొదటిసారని  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. వీటికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలను సీపీఎం బలపరుస్తుందన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలను హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్​ బాలవికాస కాన్ఫరెన్స్​ హాలులో సోమవారం ప్రారంభించారు. ఆయనతో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఏ.విజయరాఘవన్​, చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

పార్టీ సమావేశాలను ప్రారంభించి సీతారాం ఏచూరి మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ సావర్కర్​ సిద్ధాంతాలతో పని చేస్తున్నారని, గాంధీని మరిపించి సావర్కర్​ ను జాతిపితగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారన్నారు.  75 ఏండ్లలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులపై దాడులు పెరిగాయని, ఇందుకు నిరసనగా ఆగస్టు 1 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో ప్రచారోద్యమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 30,31 తేదీల్లో జరగనున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో మతోన్మాదం, రాజ్యాంగం, మానవ హక్కుల గురించి చర్చించి, వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేసి పోరాటాలు చేపడుతామన్నారు. సీపీఎం  రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  మాట్లాడుతూ రాష్ట్రంలో పోడు భూమి పట్టాలకు సంబంధించి 4 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క గిరిజనుడికి  కూడా పట్టా ఇవ్వలేదన్నారు.