మహాప్రస్థానంలో సీతారామశాస్త్రి అంత్యక్రియలు

మహాప్రస్థానంలో సీతారామశాస్త్రి అంత్యక్రియలు
  • అనారోగ్యంతో కన్నుమూసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి
  • లంగ్​ క్యాన్సర్​తో బాధపడుతూ తుది శ్వాస
  • నేడు ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ చాంబర్‌‌‌‌కు పార్థివ దేహం
  • తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు
  • 800 చిత్రాల్లో 3 వేలకు పైగా పాటలు
  • ఉత్తమ సినీ గేయ రచయితగా 11 సార్లు నంది అవార్డులు
  • 4 ఫిలింఫేర్లు.. 2019లో పద్మశ్రీ  

హైదరాబాద్, వెలుగు: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) కన్నుమూశారు. కొంత కాలంగా లంగ్​ క్యాన్సర్​తో బాధపడుతున్న ఆయన.. ఆరోగ్యం విషమించి సికింద్రాబాద్‌‌లోని కిమ్స్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. బుధవారం ఉదయం ఏడు గంటలకు అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం ఫిలింనగర్‌‌‌‌లోని ఫిల్మ్ చాంబర్‌‌‌‌లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నాలుగు దశాబ్దాల సినిమా కెరీర్‌‌లో దాదాపు 800 చిత్రాల్లో 3 వేలకు పైగా పాటలు రాసిన సిరివెన్నెల.. ఉత్తమ సినీ గేయ రచయితగా 11 సార్లు నంది అవార్డులు, 4 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెల్చుకున్నారు.

2019లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. ఆయన మృతిపై ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, సీఎం కేసీఆర్, ఇతర సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.అనారోగ్యంతో ఈ నెల 24న కిమ్స్ ఆస్పత్రిలో సిరివెన్నెల చేరారు. ఐసీయూలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని సోమవారం హాస్పిటల్ మేనేజ్‌‌‌‌మెంట్ వెల్లడించింది. మంగళవారం ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తున్న సమయంలో ఆరోగ్యం మరింత విషమించిందని తెలిపింది. సిరివెన్నెలకు ఇచ్చిన ట్రీట్‌‌‌‌మెంట్, మరణానికి గల కారణాలను కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ బొల్లినేని భాస్కర్ రావ్ వెల్లడించారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఆరేండ్ల క్రితం క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ సోకడంతో సగం ఊపిరితిత్తి తీసేయాల్సి వచ్చిందని, తర్వాత బైపాస్ సర్జరీ చేశారని తెలిపారు. వారంరోజుల కిందట ఇంకో లంగ్‌‌‌‌కి క్యాన్సర్ వస్తే దాంట్లో కూడా సగం తీసేశారని చెప్పారు. ఆపరేషన్ జరిగిన రెండు రోజులు ఆయన ఆరోగ్యం బాగుందని, తర్వాత కాంప్లికేషన్స్ రావడంతో అడ్వాన్స్‌‌‌‌డ్ ట్రీట్‌‌‌‌మెంట్ కోసం కిమ్స్‌‌‌‌కి షిఫ్ట్ చేశారని తెలిపారు. ‘‘కిమ్స్‌‌‌‌లో రెండు రోజులు ట్రీట్‌‌‌‌మెంట్ ఇవ్వగా రికవర్ అయ్యారు. ట్రెకియోస్టమీ కూడా చేశాం. 45 శాతం లంగ్ తీసేసిన తర్వాత మిగతా 55 శాతానికి ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఆక్సినేషన్ సరిగా లేక ఎక్మోమెషిన్ మీద పెట్టాం. ఐదురోజులుగా ఎక్మో మెషిన్ మీదే సిరివెన్నెల ఉన్నారు. క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, ఒబీస్ పేషెంట్ కూడా కావడంతో కిడ్నీ పాడైపోయి ఆ ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించింది. సాయంత్రం 4.07 నిమిషాలకు తుది శ్వాస విడిచారు” అని తెలిపారు.
ఎంతగానో బాధించింది
సిరివెన్నెల మరణం ఎంతగానో బాధించింది. ఆయన రచనలో బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఆయన ఎంతో కృషి చేశారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.- ప్రధాని నరేంద్ర మోడీ
తెలుగు భాషకు పట్టం కట్టారు
త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో మరణవార్త వినాల్సి రావడం విచారకరం. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. తెలుగు భాషకు పట్టంకట్టారు. ఆయన రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేను కూడా ఒకణ్ని.- ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు