ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తం : మంత్రి పొన్నం ప్రభాకర్

ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తం : మంత్రి పొన్నం ప్రభాకర్

ముషీరాబాద్, వెలుగు :  ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంటే, నిన్నటిదాకా అధికారంలో ఉండి, నేడు ఓర్వలేక దూషిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. పదేళ్లు పాలించి ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, వాటిని అడిగే చాన్స్ ఇవ్వనిలేని వారు అవాకులు చెవాకులు పేలడం సరికాదన్నారు. మహిళలకు ఉచిత బస్సు జర్నీ సక్సెస్ అయితే.. ఓర్వలేని బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం ఆటో కార్మికులను రెచ్చగొట్టి ధర్నా చేయిస్తున్నారని ఆరోపించారు. బుధవారం ముషీరాబాద్ భోలక్ పూర్​లోని అంజుమన్ స్కూల్​లో ప్రజా పాలన సెంటర్​ను కలెక్టర్ అనుదీప్ , బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్​తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. అప్లికేషన్స్ ఎలా వస్తున్నాయి.. ప్రజలు ఏమనుకుంటున్నారు..  ఇబ్బంది అయితుందా.. అని సిబ్బందిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఘటన జరగకుండా ప్రజాపాలన సక్సెస్​గా కొనసాగుతుంటే, మొన్నటిదాకా అధికారంలో ఉన్నవారు ఆక్రోశం చూపించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రజాపాలనకు 6వ తేదీ ఆఖరని, 4 నెలల తర్వాత మళ్లీ ఉంటుందని తెలిపారు. బల్దియా కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ సిబ్బందితో కలిసి 150 డివిజన్లలో 630 పైగా ప్రాంతాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. డేటా ఎంట్రీకి ప్రభుత్వం డిసైడ్ చేసిన తర్వాత  సర్వర్ అప్లికేషన్ తయారు చేయనుందని తెలిపారు. ప్రస్తుతం అప్లికేషన్ కొరత లేదన్నారు. ప్రభుత్వ అధికారులు జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ యాదయ్య, డీఈ సన్నీ, ప్రజా పాలన స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు అనిల్ కుమార్ యాదవ్, నల్లవెల్లి అంజిరెడ్డి, కల్పన యాదవ్, వాజిద్ హుస్సేన్ ఉన్నారు.