కరెంటు షాక్ తో ఒకే కుటుంబంలో ఆరుగురి దుర్మరణం

కరెంటు షాక్ తో ఒకే కుటుంబంలో ఆరుగురి దుర్మరణం
  • ఒకరిని కాపాడబోయి మరొకరు.. మొత్తం ఆరుగురు కరెంట్ షాక్ గురై మృతి
  • మధ్యప్రదేశ్ ఛతాపూర్ జిల్లాలో ఘటన

భోపాల్: కరెంట్ షాక్ ఒకే కుటుంబంలో ఆరుగురిని పొట్టనపెట్టుకుంది. సెప్టిక్ ట్యాంకు నిర్మాణం చేపట్టి దాని పైకప్పు నిర్మాణానికి అవసరమైన ప్లేట్లను బిగించే ప్రయత్నంలో  ఆ కుటుంబానికి చెందిన ఆరుగురు వరుసగా కరెంట్ షాక్ కు గురై మృత్యువాత పడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రోంలోని ఛతాపూర్ జిల్లాలో బిజీలి పోలీసు స్టేషన్ పరిధిలోని బిజావర్ గ్రామంలో ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగిన ఘటన విషాదం రేపింది.  మృతులంతా ఒకే కుటుంబానికి కావడం గమనార్హం. 
గ్రామానికి చెందిన అషివార్ కుటుంబీకులు తమ ఇంటి ముందు సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. నిన్న రాత్రి కూడా కాస్త సిమెంట్ పని జరగడంతో కరెంట్ లైట్ వెలుతురు పడేలా వైరు బిగించి పెట్టుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో కరెంటు వైరును తొలగించేందుకు లక్ష్మణ్ అషివార్ ప్రయత్నిస్తుండగా వాటర్ పైప్ లైన్ గుండా కరెంటు ప్రసరిస్తోంది. ఇది గమనించకపోవడంతో కరెంటు షాక్ గురై విలవిలలాడుతుంటే లాగేందుకు శంకర్ అశివార్, మిలన్ అశివార్, నరేంద్ర, రామ్ ప్రసాద్ మరియు విజయ్ ఒకరి తర్వాత ఒకరు లాగేందుకు ప్రయత్నిస్తూ షాక్ కు గురై క్షణాల్లో కన్నుమూశారు. 
కరెంట్ షాకు గురైన ఆరుగురు పక్కకు ఒరిగిపోయి పడిపోవడాన్ని గుర్తించిన ఇరుగు పొరుగు వారు 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సబ్ఇన్ స్పెక్టర్ ముఖేష్ థాకూర్ తన సిబ్బందితో హుటాహుటిన గ్రామానికి వచ్చి కరెంటు షాక్ తోపడిపోయిన వారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆరుగురు చనిపోయారని వైద్యులు ప్రకటించారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోవడం చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాదం రేపింది.