
పాట్నా: పాట్నాలోని గంగా నదిలో బోటు బోల్తాపడటంతో ఆరుగురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బోటులో 17మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బోటులో ప్రయాణిస్తున్న వారంతా ఒకే ఫ్యామిలీకి చెందిన వారని చెప్పారు. ఆదివారం ఉదయం 9.15 గంటలకు ఉమానాథ్ గంగా ఘాట్ నుంచి 17 మంది భక్తులతో బోటు బయల్దేరింది. నది మధ్యలోకి వెళ్లేసరికి బోటు తలకిందులయ్యింది.
దీంతో వెంటనే స్పందించిన స్థానికులు, జాలర్లు 11 మందిని కాపాడారు. వీరిలో కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన ఆరుగురు గల్లంతయ్యారు. పడవలో ప్రయాణిస్తున్న వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. గంగా దసరా పండుగ నేపథ్యంలో ఆదివారం గంగా నదిలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు చేశారు.