మెదక్లో ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చెక్

మెదక్లో ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చెక్

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. వారిలో నలుగురు బీఆర్ఎస్ కు చెందిన వారు కాగా, ఒకరు కాంగ్రెస్, మరొకరు బీజేపీకి చెందినవారు. మెదక్, ఆందోల్, నారాయణ ఖేడ్, హుస్నాబాద్​లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు పద్మా దేవేందర్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి,  సతీశ్​కుమార్, సంగారెడ్డి లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, దుబ్బాకలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘు నందన్ రావులకు ఆయా నియోజకవర్గ ప్రజలు జలక్​ ఇచ్చారు.   

పద్మారెడ్డి ఓటమికి కారణాలెన్నో..

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్​ ఎమ్మెల్యేగా గెలుపొందిన బీఆర్ఎస్​అభ్యర్థి పద్మా దేవేందర్​ రెడ్డి ఈ ఎన్నికల్లో కూడా గెలుపొంది హ్యాట్రిక్​ కొట్టాలని ఆశించారు. కానీ ఆమె ఆశలు అడియాసలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఆమె రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోపాటు, వెన్నంటి ఉండే పలువురు ముఖ్య నాయకుల వ్యవహార శైలి, ఎమ్మెల్సీ సుభాష్​రెడ్డికి టికెట్​ రాలేదని ఆయన వర్గానికి చెందిన నాయకులు కాంగ్రెస్​లోకి వెళ్లడం, పార్టీ కోసం కష్టపడిన నాయకులకు నామినేటెడ్​ పోస్టుల్లో ఛాన్స్​దొరకకపోవడం, ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయ ఆభరణాల తరలింపు వ్యవహారంలో ఆరోపణలు రావడం, ప్రధాన అభివృద్ధి పనులు ఏళ్లుగా పూర్తికాకపోవడం, డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లు కొందరికి మాత్రమే దక్కడం, మెదక్​ పట్టణంలో అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉండడం, రామాయంపేట పట్టణానికి చెందిన తల్లీ కొడుకులు సూసైడ్​ చేసుకున్న సంఘటనలో బాధిత కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, నిందితులైన అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై పార్టీ పరంగా చర్యలు తీసుకోకపోవడం వంటివి పద్మాదేవేందర్​రెడ్డి ఓడి పోవడానికి దారితీశాయి. 

ప్రభుత్వ వ్యతిరేక ఓటు

హుస్నాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ఓటమికి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కారణమని తెలుస్తోంది. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన సతీశ్ కుమార్ ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎదురించి గెలుపును అందుకోలేక పోయారు. ఇదే సమయంలో తెలంగాణ కోసం పార్లమెంటులో పోరాడన్న పేరున్న పొన్నం ప్రభాకర్ కు బీసీల మద్దతు లభించింది.

నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధిక సంఖ్య లో ఉండడంతో వారంతా పొన్నంకు మద్దతుగా నిలిచినట్టు పోలైన ఓట్లతో తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన శ్రీరాం చక్రవర్తి పోటీ చేసినా చివరి నిమిషంలో గెలిచే పొన్నం వైపే బీసీ వర్గాలు మొగ్గు చూపడంతో  కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గెలుపొందినట్టు అర్థమవుతోంది.

ఓట్ల లెక్కింపులో అన్ని రౌండ్లలో పొన్నంకు ధీటుగా సతీశ్ కుమార్ కు ఓట్లు లభించినా ఆధిక్యత సాధించక లేకపోయారు. ప్రతి రౌండ్ లో దాదాపు ఐదు వందల నుంచి వేయి ఓట్ల మెజార్టీ సాధించిన పొన్నం ప్రభాకర్ 19,344 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

అతి విశ్వాసంతో ఓటమి

నారాయణఖేడ్ బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి కచ్చితంగా గెలుస్తానన్న అతి విశ్వాసం ఆయన కొంప ముంచింది. బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ భూపాల్ రెడ్డి సోదరుడు విజయపాల్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరి అతడికి సపోర్ట్ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. పార్టీ క్యాడర్ ను పట్టించుకోకపోవడం, ప్రభుత్వ పథకాలు గెలిపిస్తాయన్న అతి నమ్మకం ఆయన ఓటమికి కారణమయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కర్ కలిసిపోయి ఓట్లు చీలిపోకుండా చూసుకోవడంతో ఆ పార్టీ విజయ తీరాన్ని తాకింది. 

స్వయంకృతాపరాధం

సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న జగ్గారెడ్డి సిట్టింగ్ స్థానాన్ని పోగొట్టుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ 9,272 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొదటి నుంచి జగ్గారెడ్డి నియోజకవర్గంలో ఫుల్ ప్లెడ్జ్ గా ప్రచారం చేయకపోవడంతో ఓటమి పాలయ్యారన్న ప్రచారం జరుగుతోంది. జగ్గారెడ్డి భార్య నిర్మలారెడ్డి, కూతురు జయరెడ్డి ప్రచారం చేసినప్పటికీ జగ్గారెడ్డి రాలేదన్న అసంతృప్తి ఓటర్లలో మిగిలిపోయింది.

పైగా కాంగ్రెస్ ప్రచార ఆర్భాటాలు పెద్దగా కనిపించలేదు. కాంగ్రెస్ హవా వీస్తోంది, ఎలాగైనా గెలుస్తాం అనే అతి విశ్వాసంతో జగ్గారెడ్డి ఓడిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరి రెండు రోజులు జగ్గారెడ్డి నియోజకవర్గానికి పూర్తిగా దూరంగా ఉండడం మైనస్ అయిందని పార్టీ సెకండ్ క్యాడర్ భావిస్తోంది. దీన్ని బీఆర్ఎస్ క్యాండిడేట్ చింతా ప్రభాకర్ అనుకూలంగా మార్చుకున్నారని చెప్పుకుంటున్నారు. ఏదేమైనాప్పటికీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సంగారెడ్డి సిట్టింగ్ స్థానాన్ని పోగొట్టుకోవడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురి చేసింది. 

అసమ్మతి సెగలు

ఆందోల్ సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహా చేతిలో ఓడిపోయారు. అందుకు కారణం సొంత పార్టీలో అసమ్మతి సెగలు పెరగడం. స్థానికంగా ఉంటున్నప్పటికీ కార్యకర్తల సమస్యల పట్ల వెంటనే స్పందించరన్న విమర్శలు ఉన్నాయి. జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, స్థానిక ప్రజాప్రతినిధులతో దూరంగా ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. వీరందరు ఆయనకు సపోర్ట్ చేయలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహా రెండు పర్యాయాలు ఓడిపోవడంతో అతనిపై పెరిగిన సానుభూతి కాంగ్రెస్ ను గెలిపించింది.

కొంపముంచిన సింపతి 

దుబ్బాక నియోజకవర్గంలో సింపతి సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కొంప ముంచింది. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్​రెడ్డిపై కత్తి పోటు దాడి ఓటర్ల పై తీవ్ర ప్రభావం చూపినట్టుగా అర్థమవుతోంది. కత్తి పోటుతో ప్రభాకర్​రెడ్డి దాదాపు పక్షం రోజులు హాస్పిటల్​కే పరిమితమయ్యారు. దీంతో ఆయన భార్య, కొడుకు గ్రామ గ్రామాన తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు.

గ్రామీణ నియోజకవర్గమైన దుబ్బాక ఓటర్లు కత్తి దాడి సంఘటనతో ప్రభాకర్​రెడ్డిపై సానుభూతి చూపించి ఓట్లు వేశారని తెలుస్తోంది.  ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటికి రఘునందన్ రావుకే విజయావకాశాలు మెండుగా కనిపించినా కత్తి పోటు తర్వాత ప్రభాకర్​రెడ్డికి సింపతి పెరిగింది. పోలింగ్ కు ముందు రోజు జరిగిన కొన్నిపరిణామాలు బీజేపీ అభ్యర్థికి ప్రతికూలంగా, కొత్త ప్రభాకర్​రెడ్డికి అనుకూలంగా మారి వార్ వన్ సైడ్ అయ్యింది. మొదట్లో ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీ వస్తుందని భావించారు కానీ బీఆర్ఎస్ అభ్యర్థికి ఊహించని రీతిలో 53,707 ఓట్ల మెజార్టీ లభించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.