జమ్మూలో ఆరుగురు టెర్రరిస్టులు హతం

జమ్మూలో ఆరుగురు టెర్రరిస్టులు హతం
  •  కుల్గాం జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్లు

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్​లో జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో మరణించిన టెర్రరిస్టుల సంఖ్య ఆరుకు చేరుకుంది. శనివారం కుల్గాం జిల్లాలోని మోడెర్గామ్, చినిగామ్ గ్రామాల్లో సైన్యం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లను నిర్వహించింది. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారు. ఆదివారం ఎన్​కౌంటర్​కు సంబంధించిన వివరాలను అధికారులు మీడియాకు తెలిపారు. ‘‘ఆదివారం మోడెర్గామ్ ప్రాంతం నుంచి ఇద్దరు టెర్రరిస్టుల మృతదేహాలు, చినిగామ్ నుంచి నలుగురి టెర్రరిస్టుల డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నాం. టెర్రరిస్టులతో పోరాడే క్రమంలో ఒక ఎలైట్ పారా కమాండోతో సహా ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు” అని చెప్పారు. 

పెద్ద సంఖ్యలో టెర్రరిస్టులను హతం చేయడంపై జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఆర్ఆర్ స్వైన్ సంతోషం వ్యక్తంచేశారు. ‘‘జమ్మూ కాశ్మీర్​లో ఒకేసారి ఆరుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టడం భారీ విజయం. భద్రతాబలగాలను బలోపేతం చేసే ప్రయత్నాలలో ఇది పెద్ద మైలురాయి.  టెర్రరిస్టులను మట్టుబెట్టే ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందనడానికి ఇదొక సంకేతం” అని పేర్కొన్నారు.

అకోలాలో జవాన్ అంత్యక్రియలు

చినిగామ్ గ్రామంలో జరిగిన ఎన్​కౌంటర్​లో వీరమరణం పొందిన ప్రభాకర్ జంజాల్ అనే జవాన్ అంత్యక్రియలు మహారాష్ట్రలోని అకోలాలో జరగనున్నాయని అధికారులు తెలిపారు. ఆయన స్వస్థలం మోర్గావ్ భక్రేలో జులై 8న ప్రభుత్వ లాంఛనాలతో పార్థివదేహానికి నివాళులు అర్పిస్తామన్నారు.