సిట్టింగులతో ఫైటింగ్.. అధినేతకు 6 భయాలు

సిట్టింగులతో ఫైటింగ్.. అధినేతకు 6 భయాలు
  •  నాడు తోకలు కత్తిరిస్తామని బెదిరింపులు
  • ఇప్పుడు ఆరోపణలున్నవారికే టికెట్లు
  • 29 మంది సిట్టింగులకు కోత అని లీక్
  • జాబితాలో కోత పెట్టింది 9 మందికే
  •  ఆ 20 మంది విషయంలో వెనక్కి తగ్గిన కేసీఆర్!

దళిత బంధులో కొందరు ఎమ్మెల్యేలు రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అనుచరులు అవినీతికి పాల్పడ్డా బాధ్యత మాత్రం ఎమ్మెల్యేలే వహించాలి.  అవినీతి విషయంలో ఇదే చివరి వార్నింగ్. మళ్లీ డబ్బు వసూలు చేసినట్లు తెలిస్తే.. టికెట్ ఇవ్వకపోగా పార్టీ నుంచి బయటకు పంపుతం. సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల తోకలు కత్తిరిస్తం.

= సీఎం కేసీఆర్, ఏప్రిల్ 27, 2023 తెలంగాణ భవన్

హైదరాబాద్: ఎమ్మెల్యేల అవినీతి చిట్టా తన వద్ద ఉందని, అవినీతి ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వబోమని, సరిగా పనిచేయని వారి తోకలు కత్తిరిస్తామంటూ దాదాపు నాలుగు నెలల క్రితం తెలంగాణ భవన్ లో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్ ఎందుకు మెత్తబడ్డారనేది చర్చనీయాంశమైంది. మొత్తం 29 మందికి టికెట్ ఇవ్వబోరంటూ లీకులు బయటికి వచ్చాయి. కొందరు మంత్రులు కేటీఆర్, హరీశ్​ రావు, ఎమ్మెల్సీ కవిత వద్దకు వెళ్లి తమకే టికెట్ ఇవ్వాలని ప్రాధేయ పడ్డారు. తీరా జాబితా విడుదల రోజు ఏడుగురు సిట్టింగులకు టికెట్లు ఇవ్వడం లేదని ప్రకటించినా.. లెక్కకు తొమ్మిది మంది పేర్లు జాబితాలో కనిపించలేదు. దాదాపు నాలుగు నెలల ముందుగానే టికెట్లు ప్రకటించిన కేసీఆర్.. సింహభాగం సీట్లు సిట్టింగులకే ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి చేరిన 12 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు ముగ్గురికి టికెట్ రాదనే ప్రచారం జరిగింది. చివర్లో హరిప్రియా నాయక్ కు టికెట్ ఇవ్వరనే లీకు కూడా వచ్చింది. కానీ జాబితాలో ఆ 12 మంది పేర్లున్నాయి. 

ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే..

భూకబ్జాలు, లైంగిక వేదింపులు, అవినీతి, బంధుప్రీతి తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి చిట్టా సీఎం కేసీఆర్ వద్ద ఉన్నా.. తిరిగి వాళ్లకే టికెట్లు కేటాయించడం వెనుక ఆరు ప్రధానమైన కారణాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు సెగ్మెంట్ లో జరిగిన అన్ని కార్యక్రమాలు, పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక,  నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో ఎమ్మెల్యేలను కీలకం చేయడంతో సెకండ్ లీడర్ షిప్ ఎదుగకపోవడం బలమైన కారమనే వాదన ఉంది. కొన్ని సెగ్మెంట్లలో నియోజకవర్గ ఇన్ చార్జిలుగా ఎమ్మెల్యేల సోదరులు, తనయులే ఉండటంతో పార్టీ.. ప్రభుత్వం ఆ ఫ్యామిలీయేననే భావన ఏర్పడింది. దీంతో ఎమ్మెల్యేగా గెలిచే స్థాయి ఉన్న లీడర్లు ఎదకపోవడం మరో సమస్యగా మారింది. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారిన తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం జరగలేదు. పార్టీ జిల్లా అధ్యక్షులు లేరు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేల చేతిలోనే పార్టీ ఉండిపోవడం కూడా ఓ కారణంగా భావించారని తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాదని, వేరే వాళ్లకు టికెట్లు ఇస్తే.. వేరే  పార్టీలో చేరి బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తారనే భయం కూడా గులాబీ పెద్దలకు ఏర్పడిందని సమాచారం. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 70% మంది ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. భారీగా మార్పులు చేయడంతో, వాళ్లకు ప్రజలతో సంబంధాలు లేకపోవడంతో గందరగోళం ఏర్పడి ఓటమికి దారితీస్తుందనే భావనలో ఉన్న గులాబీ బాస్ మూడో సారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు కేటాయించినట్లు సమాచారం. సిట్టింగుల మంత్రం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే!

 

ఆరు అంశాలివే..

  •  ఇతర పార్టీలకు వలస పోతారని భయం
  • క్షేత్ర స్థాయిలో గెలిచే లీడర్లు లేకపోవడం
  • పార్టీ సంస్థాగత నిర్మాణం, జిల్లా కమిటీలు లేవు
  • ఎమ్మెల్యే సెంట్రిక్ గానే పథకాలు, నియామకాలు
  • వేరే వాళ్లకు ఇస్తే సిట్టింగులే ఓడిస్తారని బుగులు
  • ఆరోపణల పేరిట 70% మందిని మారిస్తే ఓడిపోయే చాన్స్