ఆ గ్రామాలు వెరీ స్పెషల్ : తేదీతో సంబంధం లేదు.. వాళ్లకు అదే రోజు దీపావళి

ఆ గ్రామాలు వెరీ స్పెషల్ :  తేదీతో సంబంధం లేదు.. వాళ్లకు అదే రోజు దీపావళి

భారతదేశవ్యాప్తంగా దీపావళి సెలబ్రేషన్స్ ప్రతి ఏటా ఘనంగా జరుగుతుంటాయి. కర్ణాటకలోని ఓ ఆరు గ్రామాలు కాస్త డిఫరెంట్.. అక్కడ మాత్రం దీపావళి మరుసటి రోజు పండుగ చేసుకుంటాయి. ఈ ఆచారం గత కొన్నేళ్లుగా వస్తోంది. పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తున్నాయి ఆ ఆరు గ్రామాలు.. అసలింతకు ఆ గ్రామాలు ఏంటి...? వాటికి ఉన్న విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

కర్నాటక రాష్ట్రంలోని చామరాజ​నగర్​ జిల్లా గుండ్లుపేట్​తాలుకాలోని ఆరు గ్రామాలు దీపావళి తర్వాత వచ్చే బుధవారం (నవంబర్ 15న)  రోజున వీరు పండుగ నిర్వహించుకుంటున్నారు. మూడు తరాలుగా వాళ్లు పండుగను ఇలానే చేసుకుంటున్నారు. వీరనాపుర్, బన్నితలపుర్, ఇంగల్వాడి, మాద్రహళ్లి, మళవళ్లి, నెనెకట్టే గ్రామాల్లో ఈ దీపావళి పండుగను బుధవారం చేసుకుంటున్నారు. అందుకు కారణం బలి పాడ్యమి మంగళవారం రావటమే. 

దీపావళి, బలి పాడ్యమి రెండు బుధవారం రోజున వస్తేనే పండుగను ఆ రోజు చేసుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు. లేకుంటే బలి పాడ్యమి తరవాత వచ్చే బుధవారం రోజున పండుగను నిర్వహించుకుంటామంటున్నారు. ఇలా బుధవారం పండుగను జరుపుకునే సంప్రదాయం గత మూడు తరాలుగా పాటిస్తున్నారు.

బుధవారమే ఎందుకంటే.. పండుగను బుధవారం కాకుండా వేరే రోజున చేసుకుంటే ఏదైనా కీడు జరిగి.. పశువులకు నష్టం వాటిల్లుతుందని గ్రామస్తుల భయం. దీన్నే వాళ్లు నమ్ముతున్నారు. గతంలో బుధవారం కాకుండా.. సాధారణ రోజుల్లో పండుగ జరుపుకున్నప్పుడు గ్రామస్తులకు చెందిన ఆవులు అస్వస్థతకు గురయ్యాయని చెబుతున్నారు. ఇలా ఏదోక కీడు జరుగుతుందని అప్పటి పెద్దలు బుధవారం రోజున పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఈ ఆచారం పాటిస్తున్నారు.