చనిపోయి బతికింది..ఐదుగురికి బతుకునిచ్చింది

చనిపోయి బతికింది..ఐదుగురికి బతుకునిచ్చింది

తాను చనిపోతూ ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపింది ఓ చిన్నారి. ఢిల్లీలోని నోయిడాలో ఆరేళ్ల బాలిక తాను చనిపోయి మరో ఐదుగురికి అవయవదానం చేసి వారి ప్రాణాలను నిలబెట్టింది. చిన్నారి రోలీ ప్రజాపతిపై గుర్తుతెలియని దుండగులు ఏప్రిల్ 27న కాల్పులు జరిపారు. దీంతో తీవ్రగాయాలైన చిన్నారిని కుటుంబసభ్యులు ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బుల్లెట్ తలలోకి దూసుకపోవడంతో తలలో రక్తం గడ్డకట్టి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు అవయవదానం గురించి కుటుంబసభ్యులకు వివరించడంతో వారు కూడా దానికి అంగీకరించారు.

దాంతో వైద్యులు చిన్నారి కాలేయం,గుండె వాల్వ్,మూత్రపిండాలు,కార్నియాను వేర్వేరు వ్యక్తులకు అమర్చారు. ఇలా తను చనిపోతూ మరో ఐదుగురి ప్రాణాలను నిలబెట్టింది చిన్నారి రోలీ ప్రజాపతి. పాప చనిపోయినా  బతికి ఉండాలనే ఉద్ధేశ్యంతో అవయవదానం చేసినట్లు తండ్రి హరనారాయణ్ తెలిపారు. కాగా అవయవదానానికి ముందుకు వచ్చిన పాప తల్లిదండ్రులను ఎయిమ్స్ వైద్యులు అభినందించారు. అతి చిన్న వయస్సు గల వ్యక్తి అవయవదానం చేయడం ఎయిమ్స్ చరిత్రలో ఇదే తొలిసారి అని వైద్యులు తెలిపారు.

 

మరిన్ని వార్తల కోసం

గర్భిణీకి పురిటినొప్పులు..రోడ్డుపైనే ప్రసవం

వరద గుప్పిట్లో అస్సాం