చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతం : రీసెర్చ్​ స్కాలర్​ కైరా

చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతం : రీసెర్చ్​ స్కాలర్​ కైరా

అమెరికా హ్యాండ్లూమ్​రీసెర్చ్​ స్కాలర్ ​కైరా

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతమని అమెరికాకు చెందిన హ్యాండ్లూమ్, టెక్స్​టైల్​ రీసెర్చ్​ స్కాలర్​ కైరా జాప్​ గాబ్రియేల్​ అన్నారు. పోచంపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ, నారాయణపేట, గద్వాలలోని చేనేత స్థితిగతులపై స్టడీ చేసిన ఆమె.. బుధవారం మంత్రి కేటీఆర్​ను ప్రగతిభవన్​లో కలిశారు. తాను 9దేశాల్లో పర్యటించానని..ఎక్కడా లేని టాలెంట్ తెలంగాణ నేత కార్మికులకు సొంతమని మంత్రికి తెలిపారు. రాష్ట్ర చేనేతలు కొత్త టెక్నిక్​లతో బట్టలు నేయడం వల్లే ప్రపంచ మార్కెట్​లో గొప్ప విలువ ఉందని చెప్పారు. ఒకే చోట వందలాది మంది పనిచేస్తూ చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారని.. దాని వల్ల మార్కెటింగుకు మంచి అవకాశం ఉంటుందని వివరించారు. 

చేనేతకు ఇన్నోవేషన్, టెక్నాలజీని జోడిస్తే భవిష్యత్​తరాలకు కూడా ఉపయోగపడుతుందని కోరారు. కాగా, చేనేత పరిశ్రమ అభివృద్ధికి కైరా వంటి రీసెర్చ్​స్కాలర్ల సలహాలు స్వీకరిస్తామని మంత్రి కేటీఆర్​ చెప్పారు. విదేశాల్లో చేనేత పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను తెలుసుకుంటామని వెల్లడించారు. నేత కార్మికుల కోసం తమ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నదని వివరించారు. రాష్ట్ర సర్కారు తీసుకుంటోన్న చర్యల వల్లే నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయని కేటీఆర్ పేర్కొన్నారు.