V6 News

సాహిత్యోద్యమంలో ప్రత్యేక స్వరం స్కైబాబా

సాహిత్యోద్యమంలో ప్రత్యేక స్వరం స్కైబాబా

ప్రతి సమాజంలో కొన్ని స్వరాలు సహజంగా పుడతాయి... అవి తొలుత నెమ్మదిగా వినిపిస్తాయి. తర్వాత ఆలోచనగా మారతాయి. చివరికి ఒక అవసరమైన సంభాషణగా నిలుస్తాయి. తెలుగు సాహిత్యంలో అలాంటి ఒక స్వరం స్కైబాబా. అతనే షేక్ యూసుఫ్ బాబా. నల్గొండ జిల్లా కేశరాజుపల్లి అనే చిన్న గ్రామం నుంచి వెలువడిన ఈ స్వరం, క్రమంగా ఒక పరిధిని దాటి, ఒక ఆలోచనగా, ఒక ప్రశ్నగా, ఒక నిరంతర యాత్రగా మారింది. కొన్ని పేర్లు వ్యక్తులను మాత్రమే సూచించవు... ఒక భావాన్ని, ఒక యుగాన్ని, ఒక నిరంతర ప్రశ్నను సూచిస్తాయి. కొన్ని స్వరాలు కేవలం కవిత్వంగా వినిపించవు.. అవి గాయాల్ని వెలిబుచ్చుతాయి, చరిత్రను చెబుతాయి, భవిష్యత్తును ప్రశ్నిస్తాయి. అలాంటి స్వరమే స్కైబాబా. 

‘అజాన్’లో ఉన్న పిలుపు కేవలం నమాజు కోసమే కాదు.. చైతన్యం వైపుకు పిలుపు. ‘జల్‌జలా’లో ఉన్న ప్రకంపన, సమాజంలోని నిశ్శబ్దాన్ని ఛేదించే సంచలనం. ‘దర్ద్’లో ఉన్న నొప్పి, వ్యక్తిగతమైనది కాదు.. సమాజం గుండె లోతుల్లో మెలిపెడుతున్న బాధ. ‘అలావా’, ‘వతన్’ ఇలా ఎన్నో.. మరెన్నో అనుభవాల ప్రతిధ్వనులు. ఇవి పేర్లు కాదు.. గుర్తింపు కోసం, స్వాభిమానం కోసం జరిగిన అంతర్గత యాత్రలు. ‘నేలలేని దేశం’ ఒక కవితా సంపుటి మాత్రమే కాదు, అది మానవత్వానికి సంధించిన ప్రశ్న. భూమి లేకుండా జీవించడం అంటే ఏమిటి? గుర్తింపు లేకుండా బతకడం అంటే ఎంత పెద్ద శాపం? స్కైబాబా రచనలు కేవలం సాహిత్యానికి పరిమితం కావు. అవి సమాజంతో నేరుగా సంభాషిస్తాయి. అతని పదాలు మృదువుగా ఉండవు.. అవి కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన లక్ష్యం ఆకట్టుకోవడం కాదు, మెలకువ తీసుకురావడం, జాగృతం చేయడం. ముస్లిం సమాజం గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది బయటివారిగా మాట్లాడతారు. కానీ స్కైబాబా... లోపలివాడిగా మాట్లాడతాడు. అతను విమర్శిస్తాడు... కానీ ద్వేషంతో కాదు, పరివర్తన కోరికతో. మతతత్వం అనే గోడలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే ఆ గోడలు మనుషులను విభజిస్తాయి, చైతన్యాన్ని బంధిస్తాయి. 

అతను ఆవిష్కరించిన ముస్లింవాదంపై భిన్నాభిప్రాయాలుండవచ్చు. కాని, అది ఎవరిపైనా వ్యతిరేకత కాదు, తమలో చైతన్యం కోసం చేసే పోరాటమే అంటాడాయన. అయితే, ఈ స్వరాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దానిలోని మరొక కోణాన్ని కూడా చూడాలి. స్కైబాబా స్వరంలో ఉన్న కఠినత, అతని నిబద్ధతకు ప్రతిబింబం అయినప్పటికీ, కొన్నిసార్లు అదే కాఠిన్యం అతని విమర్శల కోణాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుందనే భావన కలుగుతుంది. ముస్లిం సమాజంలో ఉన్న లోపాలపై ఆయన వేసే ప్రశ్నలు సార్ధకమైనవే. వరకట్నం, కుటుంబ అన్యాయాలు, వడ్డీ వంటి అంశాల్లో కనిపించే విరుద్ధతలను ఎత్తిచూపడం అవసరమే. అయితే, ఈ విమర్శలు కొన్ని సందర్భాల్లో ఆచరణలోని లోపాలకన్నా మత సిద్ధాంతాలపై ప్రశ్నలుగా వినిపిస్తుంటాయి. అందుకే ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక సున్నితమైన ఆత్మపరిశీలన అవసరం.  విమర్శ ఒక దిశను చూపాలి, అపార్ధాన్ని కాదు. ఈ సరిహద్దు మరింత స్పష్టంగా ఉంటే ఆయన స్వరం ఇంకా ప్రభావవంతమవుతుంది. 

స్కైబాబా పడే ఆవేదన, ఆవేశం అతని నిజాయితీకి నిదర్శనం. అయినప్పటికీ, అదే సమయంలో సిద్ధాంతం, ఆచరణ మధ్య ఉన్న తేడాను మరింత స్పష్టంగా రేఖాంకితం చేస్తే ఆయన సందేశం ఇంకా బలంగా, విస్తృతంగా వినిపించే అవకాశం ఉంది. ఒక ఉద్యమకారుడిగా, కవిగా ఆయన స్వరం ఎంత ప్రభావవంతమో, అదే స్థాయిలో సమతుల్యత కూడా అతని ఆలోచనలకు మరింత విశ్వసనీయతను తీసుకొస్తుంది. ఈ ఆలోచనా తీరే అతన్ని కేవలం రచయితగా కాకుండా ఉద్యమకారుడిగా కూడా మలిచింది. తెలంగాణ ఉద్యమంలో స్కైబాబా పాత్ర జగద్విదితం. అది కేవలం రాజకీయ పోరాటం కాదు, అది ఆత్మగౌరవ యుద్ధం. ఆ యుద్ధంలో చాలామంది నినాదాలు ఇచ్చారు, కొంతమంది నాయకత్వం వహించారు. కానీ కొద్దిమంది మాత్రమే ఆ ఉద్యమానికి ఆత్మగా నిలిచారు. అలాంటి వారిలో స్కైబాబాది ముందు వరుస. అతని కవిత్వం ఉద్యమానికి శబ్దమైతే, అతని ఉనికి ఉద్యమానికి అర్థమైంది. అయితే, స్కై ప్రయాణమంతా పూలదారేమీ కాదు, ముళ్ళబాటకూడా.. విమర్శలు, విబేధాలు, వివాదాలు అన్నీ ఉన్నాయి. ఉద్యమ జీవితంలో ఇది సహజం.

ఎందుకంటే ఆలోచించే వ్యక్తి ఎప్పుడూ ప్రశ్నలు లేవనెత్తుతాడు. ప్రశ్నలు లేవనెత్తిన చోట వివాదాలు తప్పవు. కానీ.. ఈ వివాదాల మధ్య కూడా ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అదే అతని నిబద్ధత. అతని నిజాయితీ. నమ్మిన దారిలో నడవడం అంత సులభం కాదు. ప్రత్యేకంగా ఆ దారి విమర్శలతో నిండినదైనప్పుడు. ముస్లిం రిజర్వేషన్ల కోసం ఆయన చేసిన పోరాటం సామాజిక న్యాయం కోసం చేసిన ప్రయత్నం. బహుజన వర్గాలతో ఆయన కలిసిన విధానం ఒక సమైక్యతా దృక్పథం. ముస్లిం సంఘీభావ సంకలనాలు ఒక సామూహిక చైతన్యానికి సూచిక. స్కైబాబా రచనల ప్రభావం కేవలం తెలుగు వరకే పరిమితం కాలేదు. ఆయన రాసిన ముస్లిం కథలు ఇంగ్లీషు, హిందీ భాషల్లోకి అనువాదమై పుస్తకాల రూపంలో వెలువడి విస్తృత ఆదరణ పొందుతున్నాయి. మలయాళంలోనూ ఆయన రచనలు పాఠకులను చేరుకోవడం, ఆయన ఆలోచనలకు భాషా సరిహద్దులు లేవన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. స్కైబాబా ఆలోచనల్లో కేవలం ప్రతిఘటన మాత్రమే కాదు, ఒక నిర్మాణాత్మక దిశ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ‘దునియాదారి’ వంటి ముస్లిం సామాజిక ఉద్యమాల నేపథ్యంలో ఆయన చూపించే దృక్పథం, సమాజాన్ని లోపలి నుంచి మేల్కొలిపే ప్రయత్నం. ‘దీన్ కే సాత్ దునియా కో లేకే చలో’ అనే నినాదం  ఆధ్యాత్మిక విలువలతోపాటు, ప్రాపంచిక జీవన బాధ్యతలను కలిపే సమతుల్య దారిని సూచిస్తుంది. మదర్సాలను ఆధునీకరించాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ ఆయన తీసుకొచ్చిన పుస్తకం, వ్యాసాలు - ఇవన్నీ కలిపి చూస్తే, స్కైబాబా కేవలం ప్రశ్నించే కవి మాత్రమే కాదు, మార్గాన్ని సూచించే ఆలోచనాపరుడు కూడా అన్న విషయం స్పష్టమవుతుంది. 

ఇలాంటి ఆలోచనలతో సాగుతున్న నిరంతర ప్రయాణానికి ఇప్పుడు ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. 2026 ఏప్రిల్ 18న, మహారాష్ట్రలోని పూణేలో ‘స్వాతంత్ర్య సమరయోధుడు బాబూమియా బ్యాండ్ వాలే జాతీయ సమైక్యత అవార్డు’ స్కైబాబాకు ప్రదానం చేశారు. బాబూమియా బ్యాండ్ వాలే వంటి స్వాతంత్ర్య సమరయోధుడి పేరుతో ఉన్న అవార్డు చరిత్ర, పోరాటం, సమైక్యతల కలయిక. అలాంటి గౌరవం స్కైబాబా ప్రయాణానికి ఒక సాక్ష్యం. 

- యండి. ఉస్మాన్ ఖాన్ 
సీనియర్ జర్నలిస్ట్

లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ
featureseditor@v6velugu.com