నిప్పులు చెరిగిన పాక్ బౌలర్లు.. 166 పరుగులకే లంక ఆలౌట్

నిప్పులు చెరిగిన పాక్ బౌలర్లు.. 166 పరుగులకే లంక ఆలౌట్

శ్రీలంక పర్యటనలో పాకిస్తాన్ బౌలర్లు ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్‍లో 1-0తో ఆధిక్యంలో ఉన్న పాక్.. రెండో టెస్టులోనూ అదే దిశగా సాగుతోంది. కొలొంబో వేదికగా ఈ ఇరు జట్ల మధ్య సోమవారం (జులై 24) మొదలైన రెండో టెస్టులో పాక్.. తొలి రోజే మ్యాచ్‌లో పైచేయి సాధించింది.

టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న లంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలింది. పాక్ పేసర్లు నసీం షా (3/41), షాహీన్‌ అఫ్రిది (1/44) నిప్పులు చెరగగా.. స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ (4/69) మాయాజాలం ప్రదర్శించారు. ఈ ముగ్గురి ధాటికి లంక తొలి ఇన్నింగ్స్ 50 ఓవర్లలోపే ముగిసింది. ధనంజయ డిసిల్వా (57) ఒక్కరే అర్హసెంచరీతో రాణించగా.. మిగిలిన బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాక్ బ్యాటర్లు వన్డే తరహాలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. 24 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(6) నిరాశ పరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ షాన్ మసూద్(51) టీ20 తరహాలో బ్యాటింగ్ చేశారు. 44 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్న మసూద్.. ఆ వెంటనే వెనుదిరిగారు. ప్రస్తుతానికి మరో ఓపెనర్ అబ్దుల్లా షఫిక్ (64 నాటౌట్), బాబర్ ఆజాం(5) క్రీజులో ఉన్నారు.