
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేపై వివాదాస్పద కామెంట్స్ చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను మంగళవారం ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు బెయిల్ కోసం రత్నగిరి కోర్టుకు వెళ్లినప్పటికీ.. న్యాయమూర్తి తిరస్కరించడంతో పోలీసులు రాణేను కస్టడీలోకి తీసుకున్నారు. మహారాష్ట్రలో జన ఆశీర్వాద్ యాత్రకు వెళ్లిన కేంద్ర మంత్రి రాణే మాట్లాడుతూ సీఎం ఉద్ధవ్ థాక్రేపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ‘‘స్వాతంత్ర దినోత్సవం నాడు స్పీచ్ సందర్భంగా సీఎం ఉద్ధవ్ ఈ ఏడాది ఎన్నో ఇండిపెండెన్స్ డే జరుపుకొంటున్నామో గుర్తు లేక వెనక ఉన్న వాళ్లను అడగడం సిగ్గు చేటు. ఆ సమయంలో నేను అక్కడ ఉండుంటే ఉద్ధవ్ చెంప పగలగొట్టేవాడిని” అని రాణే అన్నారు. దీంతో ఆయనపై శివసేన కార్యకర్తలు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆ ఫిర్యాదులపై స్పందించిన నాసిక్ పోలీస్ కమిషనర్ దీపక్ పాండే ఈ రోజు ఉదయం రాణేను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు ఆయనను రత్నగిరి జిల్లా చిప్లున్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే రత్నగిరి జిల్లా కోర్టులో యాంటిస్పెట్రీ బెయిల్ కోసం ప్రయత్నించగా కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం బాంబే హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు.