ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ధన్వాడ/మరికల్, వెలుగు : ధనిక రాష్ర్టాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ ను మళ్లీ గెలిపిస్తే రాష్ర్ట ప్రజలకు బానిస బతుకులు తప్పవని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హెచ్చరించారు. గురువారం ధన్వాడ, మరికల్ మండలాల్లోని గున్ముక్ల, ఏమ్మోన్నిపల్లి, మంత్రోనిపల్లి, ఏలిగేండ్ల, పస్పుల, మందిపల్లి, కంసాన్​పల్లి, ధన్వాడ గ్రామాల్లో ‘ప్రజాగోస.. బీజేపీ భరోసా’ బైక్​ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పస్పుల గ్రామంలో టీఆర్ఎస్, కాంగ్రెస్​​ పార్టీల లీడర్లు, కార్యకర్తలు 100 మంది బీజేపీలో చేరగా..  డీకే అరుణ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశరక్షణ, అందరం సుభిక్షంగా ఉండాలంటే బీజేపీ డబుల్​ఇంజిన్​ పాలనతోనే సాధ్యమన్నారు. బీజేపీ ‘పేట’ నియోజకవర్గ ఇన్​చార్జి రతంగ్​ పాండ్​రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్​, రాష్ర్ట, జిల్లా, మండల నాయకులు డోకూరు పవన్​కుమార్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సాయుధ పోరాటంతోనే తెలంగాణకు విముక్తి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా చేసిన సాయుధం పోరాటంతోనే తెలంగాణకు విముక్తి కలిగిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్​లో మీడియా సమావేశంలో మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. తెలంగాణకు రాలేదని, సాయుధ పోరాటంతోనే అది సాధ్యమైందన్నారు.  బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని,  ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో లిక్కర్ సంబంధం ఉన్న కవిత, కేటీఆర్ లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారే తప్ప అరెస్టు చేయడం లేదని కేంద్రంపై మండిపడ్డారు.  అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నట్లు నారాయణ తెలిపారు.  కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ​ఇతర రాష్ట్రాలకు పోతున్నారే తప్ప పక్కనున్న జగన్ వద్దకు ఎందుకు వెళ్తలేరో సమాధానం చెప్పాలని డిమాండ్​చేశారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాల్ నరసింహ, కేశవులు గౌడ్, రామకృష్ణ, భరత్, వెంకటయ్య పాల్గొన్నారు. 

సమైక్యతా ర్యాలీ ని సక్సెస్​ చేయండి

వనపర్తి/ గద్వాల/ మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం వనపర్తిలో నిర్వహించనున్న సమైక్యతా ర్యాలీని సక్సెస్​ చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్  బాషా పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్  జిల్లా కేంద్రంలో సమైక్యతా ర్యాలీ ఏర్పాట్లను  పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ  శుక్రవారం  ఉదయం 11గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్​నుంచి హౌజింగ్ బోర్డు వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు  తెలిపారు.

గద్వాలలో..

జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం ఎస్పీ రంజన్ రతన్ కుమార్ తో కలిసి మార్కెట్ యార్డ్ లో ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం 15 వేల మందితో ర్యాలీ నిర్వహిస్తామని , అనంతరం మార్కెట్ యార్డులో  సభ నిర్వహిస్తామన్నారు.   

మహబూబ్​నగర్​లో..

మహబూబ్​నగర్​జిల్లా కేంద్రంలో 25 వేల మందితో  సమైక్యతా ర్యాలీని, బాయ్స్ కాలేజీ గ్రౌండ్​లో మీటింగ్  నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకట్ రావు తెలిపారు. గురువారం ఆయన బాయ్స్ కాలేజీ గ్రౌండ్​లో ఏర్పాట్లను పరిశీలించారు.  జడ్పీ గ్రౌండ్ ​నుంచి ర్యాలీని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభిస్తారన్నారు.  

అవినీతి పాలన సాగిస్తున్న కేసీఆర్​ ప్రభుత్వం

వనపర్తి, వెలుగు:  కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో అవినీతి పాలన సాగిస్తోందని దీనిని ఎండగట్టేందుకు బీజేపీ ఆధ్వర్యంలో ‘భరోసా’ యాత్రను నిర్వహిస్తున్నట్లు బీజేపీ సీనియర్​నేత దేవికి వాసుదేవరావు చెప్పారు. గురువారం వనపర్తి పార్టీ ఆఫీస్​లో నాయకులు, కార్యకర్తలతో ఆయన మీటింగ్​నిర్వహించారు. ‘ప్రజా గోస బీజేపీ భరోసా’ యాత్రకు రాష్ట్ర పార్టీ సమన్వయ కర్త గా తాను నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామానికి బైక్ యాత్ర నిర్వహిస్తామని, అన్ని విభాగాల కన్వీనర్లు, కో కన్వీనర్లు సమష్టిగా కృషి చేయాలని కోరారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ మండలం, పెబ్బేరు రూరల్, పెబ్బేరు పట్టణం, వనపర్తి మండలంలో ఈ నెల 18,19 తేదీలలో కొనసాగుతూ 20న ముగుస్తుందని వాసుదేవరావు వివరించారు. మునుగోడు ఉప ఎన్నికలలో బీజేపీ గెలుపు పక్కా అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్​రెడ్డి, జిల్లా ఇన్​చార్జి బోసుపల్లి ప్రతాప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.కృష్ణ,  ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీ, గిరిజన సమ్మేళనాన్ని సక్సెస్ ​చేయాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : రేపు హైదరాబాదులో కొమురం భీం ఆదివాసీ భవన్​, సేవాలాల్ బంజారా భవన్​లను ప్రారంభం సందర్భంగా నిర్వహిస్తున్న ఆదివాసీ, గిరిజన సమ్మేళనంలో జిల్లా నుంచి భారీ సంఖ్యలో పాల్గొని సక్సెస్​ చేయాలని  కలెక్టర్ ఉదయ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ క్యాంప్ ఆఫీస్​లో  కార్యక్రమ వాల్​పోస్టర్​ను కలెక్టర్ ​ఆవిష్కరించారు.  

విలీనంలో ఇద్దరి పాత్ర లేదు..

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : సెప్టెంబర్​17 సందర్భంగా  బీజేపీ, టీఆర్ఎస్​ పార్టీలు ఒకరు విమోచనం, మరొకరు జాతీయ సమైక్యత పేరుతో పోటీ పడి కార్యక్రమాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్​ నేత నాగం జనార్దన్​రెడ్డి విమర్శించారు. గురువారం నాగర్ కర్నూల్ లోని ఆయన నివాసంలో ప్రెస్​మీట్​నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడానికి అప్పటి భారత ప్రధాని నెహ్రూ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లారా? లాటి దెబ్బలు తిన్నారా? అని ప్రశ్నించారు. విలీనంలో వీరిద్దరి పాత్ర ఏమీ లేదని చెప్పారు. రాష్ట్ర సాధన బిల్లు పార్లమెంటులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం వల్లే సాధ్యమైందన్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, నాయకులు టి.పాండు, లక్ష్మయ్య, అర్జునయ్య, అహ్మద్ పాల్గొన్నారు.

నులి పురుగుల నివారణకు కృషి చేయాలి

నెట్​వర్క్​, వెలుగు:  నులి పురుగులతో పిల్లల్లో ఎదుగుదల మందగిస్తుందని, నివారణకు ఆల్బెండజోల్​ టాబ్లెట్లు వేసుకోవాలని ప్రభుత్వ విప్​గువ్వల బాలరాజు చెప్పారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినంలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  గద్వాల జడ్పీ చైర్​పర్సన్ సరిత, కలెక్టర్లు హరిచందన, క్రాంతి, డీఎంహెచ్ వోలు గురువారం వివిధ స్కూళ్లలో స్టూడెంట్లకు ఆల్బెండజోల్​ ట్యాబ్​లెట్లను వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, బహిరంగ మలవిసర్జన చేయకుండా మరుగుదొడ్లు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

అలంపూర్, వెలుగు: జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు  దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే  అబ్రహం సూచించారు. గురువారం జోగులాంబ  ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈవో పురేందర్  కుమార్, ఆలయ  చైర్మన్ బెక్కెం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్సవాలలో భక్తుల సంఖ్యను ముందస్తుగా అంచనా వేసి  కనీస సౌకర్యాలు కల్పంచాలని ఆలయ కమిటీకి సూచించారు. ఇకపై  అమ్మవారి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలు  అన్నింటిని ఆన్ లైన్ లో అందించేందుకు కొత్త వెబ్ సైట్ రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, పట్టణ ప్రముఖులు ఆలయ ధర్మకర్తలు  పాల్గొన్నారు.

పార్లమెంట్​ భవనానికి అంబేద్కర్​ పేరు పెట్టాలి

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేందుకు అన్ని రాష్ర్టాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాలని టీఎంఎం స్టేట్ ప్రెసిడెంట్ మంత్రి నర్సింహ్మయ్య డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో కొత్త పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని  సీఎం కేసీఆర్​ తీర్మానం చేసి పంపించడం హర్షణీయమన్నారు. సీఎం కేంద్రంపై వత్తిడి తీసుకురావాలన్నారు. అన్ని రాష్ర్టాలు వారి వారి రాష్ర్ట ప్రభుత్వాల తీర్మానం చేసి కేంద్రానికి లేఖలు రాసి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.  

ఊకచెట్టు వాగు బ్రిడ్జిని వేగంగా పూర్తి చేయాలి

మదనాపురం, వెలుగు : మండలంలోని రైల్వేగేట్​దగ్గరలో ఊక చెట్టు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జిని వేగంగా  పూర్తి చేయాలని యూత్​కాంగ్రెస్​స్టేట్​ప్రెసిడెంట్​శివసేనారెడ్డి డిమాండ్ ​చేశారు. గురువారం మండలంలోని ఊకచెట్టు వాగు వద్ద కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. హాజరైన శివసేనా రెడ్డి మాట్లాడుతూ ఇటీవల వర్షాల కారణంగా ఊక చెట్టు వాగులో  ఓ లెక్చరర్​ గల్లంతై మృతి చెందాడన్నారు.  ఇప్పటికైనా పాలకులు, జిల్లా అధికారులు నిర్లక్ష్యం వీడి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు.  నాయకులు ప్రశాంత్ రెడ్డి,  జగదీశ్, వడ్డె కృష్ణ, రామచంద్రయ్య, వేమన్న తదితరులు పాల్గొన్నారు.

‘ధరణి’ సమస్యలు పరిష్కరించకుంటే కలెక్టరేట్​ ముట్టడిస్తం

గద్వాల, వెలుగు: జిల్లాలో నెలకొన్న ధరణి సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించకుంటే ఈ నెల 23న కలెక్టరేట్ ను దిగ్బంధిస్తామని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ హెచ్చరించారు. గురువారం గద్వాలలో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. టీఆర్ఎస్​ఎనిమిదిన్నరేళ్ల పాలనలో  అంతా గందరగోళ పరిస్థితి నెలకొన్నదన్నారు. భూ ప్రక్షాళన పేరుతో తీసుకు వచ్చిన ‘ధరణి’ రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. దాదాపు 50 శాతం మంది రైతులు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు.  గద్వాల జిల్లాలోని 2,200 లకు పైగా సమస్యలు ఉన్నాయని వాటి కోసం నిత్యం రైతులు మీసేవ  ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారన్నారు.  సమస్యల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగానికి వారం రోజులు గడువు ఇస్తున్నామని హెచ్చరించారు.  డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి, వీరబాబు శేక్షావల్లి ఆచారి, ఇషాక్, వెంకటేశ్ ఉన్నారు.