హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన -ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శనివారం (డిసెంబర్ 6) నల్గొండ జిల్లా దేవరకొండలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో కొత్తగా లక్ష రేషన్ కార్డులు ఇచ్చామని.. అందులో 14 వేల రేషన్ కార్డులు ఒక్క దేవరకొండ నియోజవర్గంలోనే ఇచ్చామని చెప్పారు.
బీఆర్‌ఎస్ హయాంలో దేవరకొండ నియోజకవర్గంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎస్ఎల్ బీసీ టన్నెల్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు స్టార్ట్ అయ్యాయని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. కార్యకర్తల కష్టంతోనే తామంతా అధికారంలో ఉన్నామన్నారు.
