మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. దేశం దాటకుండా ధోని సహచరుడిపై నిషేధం

మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. దేశం దాటకుండా ధోని సహచరుడిపై నిషేధం

ఏ క్రీడలోనైనా మ్యాచ్ ఫిక్సింగ్ అనేది అతిపెద్ద నేరం. పట్టుబడునంతవరకే వారి రాజసం.. పొరపాటున దొరికారో వారి కెరీర్‌కు అక్కడితో ఫుల్ స్టాప్ పడినట్లే. భారత స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ అలానే తన క్రికెట్ కెరీర్‌ను నాశనం చేసుకున్నారు. ఇక దాయాది పాకిస్తాన్ జట్టులో అలాంటివారు కోకొల్లలు. తాజాగా చెన్నై మాజీ ఆటగాడిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రాగా.. విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అతను విదేశాలకు వెళ్లకుండా స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు నిషేధం విధించింది.

ధోని సహచరుడిగా మంచి పేరు

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటగాడి పేరు.. సచిత్ర సేనానాయకే. శ్రీలంక మాజీ క్రికెటర్ అయిన ఈ ఆఫ్ స్పిన్నర్ ఐపీఎల్ 2013 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడారు. ఎంఎస్ ధోనీ సారథ్యంలో చెన్నై తరఫున 8 మ్యాచ్‌లు ఆడిన అతను 9 వికెట్లు పడగొట్టారు.

విదేశాలకు వెళ్లకుండా నిషేధం

సేనానాయకే లంక ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి అతను.. ఇద్దరు ఆటగాళ్లను టెలిఫోన్‌లో సంప్రదించినట్లు అవినీతి నిరోధక విభాగం అధికారులు పలు ఆధారాలు కూడా సేకరించారు. ఈ కేసు విచారణ ప్రారంభమైన నేపథ్యంలో అతను మూడు నెలల పాటు విదేశాలకు వెళ్లకుండా కొలంబో మెజిస్ట్రేట్ కోర్టు నిషేధించింది.

సేనానాయకేపై మూడు నెలల పాటు ట్రావెల్ బ్యాన్ విధించాలని ఇమ్మిగ్రేషన్ మరియు ఎమిగ్రేషన్ కంట్రోలర్ జనరల్‌ను కొలంబో చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. మరోవైపు అతనిపై క్రిమినల్ అభియోగాలు మోపాలని క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక దర్యాప్తు విభాగం అటార్నీ జనరల్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించినట్లు కోర్టుకు తెలిపింది.

సేనానాయకే 2012 నుంచి 2016 మధ్య శ్రీలంక తరఫున 1 టెస్టు, 49 వన్డేలు, 24 టీ20లు ఆడారు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించగల సమర్ధుడు. 2014 ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజేత జట్టులోనూ అతను సభ్యుడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అతను ఫిక్సింగ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.