హెచ్1బీ ఉద్యోగులకు  నిద్రలేని రాత్రులు

హెచ్1బీ ఉద్యోగులకు  నిద్రలేని రాత్రులు
  •     వీలైనంత త్వరగా డెడ్ లైన్​ను పొడిగించాలి
  •     మానవతా దృక్పథంతో ఆలోచించాలని విజ్ఞప్తి

వాషింగ్టన్: అమెరికాలోని వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ ఎంప్లాయీస్  నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. 60 రోజుల గడువు సమీపిస్తుండడం, అమెరికాను వీడివెళ్లాల్సి రానుండడంతో వారు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. వారిలో కొన్నివేల మంది ఇండియన్  టెకీలు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉన్నారు. దీంతో 60 రోజుల గడువును మరి కొంతకాలం పొడిగించాలని ‘ఫౌండేషన్  ఫర్  ఇండియా అండ్  ఇండియన్  డయాస్పొరా స్టడీస్’ (ఎఫ్ఐఐడీఎస్) అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ‘‘డెడ్ లైన్  సమీపిస్తుండడంతో హెచ్1బీ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారి కుటుంబ సభ్యులు టెన్షన్  పడుతున్నారు.

యూఎస్ లో పుట్టిన పిల్లలు కూడా 60 రోజుల నిబంధనతో అమెరికాను వీడివెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో ఆలోచించి గడువును పొడిగించాల్సిన అవసరం ఉంది” అని ఎఫ్ఐఐడీఎస్  ఓ ప్రకటనలో పేర్కొంది. ఇండియన్ల తరపున కేసులను ఎఫ్ఐఐడీఎస్  చేపట్టింది. మరోవైపు హెచ్1బీ వీసా హోల్డర్ల గడువును 180 రోజులకు పొడిగించాలని ‘యూఎస్  సిటిజన్ షిప్  అండ్  ఇమిగ్రేషన్  సర్వీసెస్’ ఆలోచిస్తున్నది. అయితే, గడువును పొడిగించేందుకు మరి కొంతకాలం పట్టవచ్చని, ఈలోపు అమెరికాను వీడడం తప్ప హెచ్1బీ వీసా హోల్డర్లకు మరో చాన్స్ లేదని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో గ్రేస్  పీరియడ్  పొడిగింపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిపార్ట్ మెంట్ ఆఫ్​ హోంల్యాండ్  సెక్యూరిటీ (డీహెచ్ఎస్), యూఎస్ సిటిజన్ షిప్  అండ్  ఇమిగ్రేషన్  సర్వీసెస్  (యూఎస్ సీఐఎస్) కు ఎఫ్ఐఐడీఎస్  విజ్ఞప్తి చేస్తున్నది.

‘‘అమెరికాలో గత ఏడాది నుంచి ఇప్పటిదాకా 2.50 లక్షల హెచ్1బీ ఉద్యోగులను వివిధ కంపెనీలు తొలగించాయి. మరికొన్ని వేల మందిని తొలగిస్తామని మెటా వంటి కంపెనీలు ఇప్పటికే ప్రకటించి ఉన్నందున ఈ సంఖ్య భవిష్యత్తులో మరింత పెరగనుంది” అని ఎఫ్ఐఐడీఎస్  వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ఉన్న  నిబంధనల ప్రకారం ఏదైనా కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన హెచ్1బీ వీసా హోల్డర్లు 60 రోజుల్లోపు కొత్త ఉద్యోగం పొందాలి. లేదా దేశం వీడివెళ్లాల్సి ఉంటుంది. ఆ గడువును 180 రోజులకు పెంచాలని ఏషియన్  అమెరికన్స్, నేటివ్  హవాయియన్స్, పసిఫిక్  ఐలాండర్లపై అడ్వైజరీ కమిషన్  ఇప్పటికే బైడెన్  సర్కారుకు విజ్ఞప్తి చేసింది.