రూ.2.4 లక్షలకు షూరిటీ..  రూ.2.7 కోట్లయింది

రూ.2.4 లక్షలకు షూరిటీ..  రూ.2.7 కోట్లయింది

బంధువే కదా అని ఇంటిని షూరిటీగా పెట్టి రూ.2 లక్షలు లోన్‌‌గా ఇప్పించారు ఆ దంపతులు. కానీ, ఆ బంధువు వారిని మోసం చేశాడు. తీసుకున్న అప్పును కట్టలేదు. ఆ విషయం కనీసం వారికి తెలియదు. ఈలోగా ఆ అప్పు కాస్తా రూ.2.7 కోట్లకు పెరిగిపోయింది. బ్యాంకు వాళ్లొచ్చి ఆ అప్పు గురించి చెప్పి తమకున్న 22.5 సెంట్ల ఇంటిని స్వాధీనం చేసుకునేదాకా వారికి ఆ అప్పు సంగతి తెలియలేదు. ఆ బాధిత దంపతుల పేర్లు  ప్రీతా, షాజీ.  కేరళలోని ఎర్నాకుళం వాళ్ల ఊరు. 1994లో సాజన్ అనే సమీప బంధువు కోసం, ఇంటిని ష్యూరిటీగా లోన్‌‌ ఇప్పించారు.  లోన్ ఇచ్చిన బ్యాంకును ఇంకో బ్యాంకు, ఆ బ్యాంకును మరో బ్యాంకు  స్వాధీనం చేసుకుంది. అప్పు కట్టాలంటూ షాజీ దంపతులను ఒత్తిడి తెచ్చింది. ఉన్న స్థలంలో  నాలుగు సెంట్లు అమ్మి లక్ష రూపాయలు బ్యాంకుకు చెల్లించారు. కానీ అప్పటికే పెరిగిపోయిన వడ్డీకే అది చాల్లేదు. దీంతో బ్యాంకు ప్రతినిధులు వాళ్ల ఇంటిని అటాచ్ చేశారు.

యాంటీ సర్ఫేజీ పీపుల్స్ మూమెంట్ యాక్టివిస్టులు దీన్ని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత దాదాపు రెండు కోట్ల విలువ జేసే స్థలాన్ని వేలంలో బ్యాంకు రూ.38 లక్షలకే అమ్మేసింది. ఈ విషయం తెలుసుకున్న షాజీ దంపతులు షాక్ కు గురయ్యారు. ప్రీతా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఒక టైంలో ఇంటిని అటాచ్ చేసేందుకు వచ్చిన ఆఫీసర్ల ముందు దంపతులిద్దరూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయారు. కేరళ హైకోర్టు ఈ విషయంలో  జోక్యం చేసుకుంది. షాజీ దంపతుల ఇంటి అమ్మకాన్ని కోర్టు కొట్టేసింది. ఇల్లు కావాలంటే బ్యాంకుకు రూ.43.5 లక్షలు కట్టాలని షాజీ దంపతులను ఆదేశించింది. వీటిలో 1.8 లక్షల రూపాయలు బ్యాంకు నుంచి వేలంలో కొనుక్కున్న వ్యక్తికి ఇవ్వాలని చెప్పింది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా కోర్టు ఆదేశించిన డబ్బును సేకరించిన ప్రీతా, షాజీ, బ్యాంకుకు డబ్బులు కట్టేసి ఇంటిని సొంతం చేసుకున్నారు.