సోషల్ ఇంజినీరింగ్.. రాజకీయాలు ఇకపై చెల్లవు

సోషల్ ఇంజినీరింగ్.. రాజకీయాలు ఇకపై చెల్లవు

 యాదవ కురుమ రాజ్యాధికార ఐక్యవేదిక ఆధ్వర్యంలో 'మేమెంతో మాకంత' అనే ఎజెండాపై  రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్​లో జరిగింది. పలు సంఘాల నాయకులు, పార్టీలకు చెందిన యాదవ కురుమ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అందులో పాల్గొనడానికి సమాజ్​వాది పార్టీ తరఫున నాకు అవకాశం దొరికింది. ఈ సమావేశంలో యాదవ- కురుమ ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పలు నాయకులు ఉపన్యసించారు. 

ముఖ్యంగా నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వారి జనాభా దామాషా ప్రకారం రిప్రెజెంటేషన్/భాగస్వామ్యం లభించటం లేదని  వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. 14 శాతం ఉన్న గొల్ల- కురుమలకు ఒక్క మంత్రి పదవి కూడా లభించలేదని ప్రతినిధులంతా అసహనం వ్యక్తం చేశారు.  ఇటీవల  ప్రకటించిన 37 ప్రభుత్వ  కార్పొరేషన్లలో వీరికి ఒక్క చైర్మన్ పదవి కూడా దక్కలేదని ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. అదేవిధంగా టికెట్ల పంపిణీ సందర్భంలోనూ,  ఎమ్మెల్సీల నియామకాలలో కాంగ్రెస్ పార్టీ యాదవ- కురుమలను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలో బీసీలతో కలిసి రాజ్యాధికారం వైపు సాగాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

బీఆర్ఎస్​ మోడల్​ను తిరస్కరించిన ప్రజలు

బీఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడుతూ వారి ప్రభుత్వ హయాంలో ఎంతో చేసినట్లు పేర్కొన్నారు. ఆత్మగౌరవ భవనాలకు 10 ఎకరాల భూమి,  బిల్డింగ్​లకు రూ.10 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. అదేవిధంగా గొర్రెల కాపరులు లక్షలలో లబ్ధి పొందేవిధంగా గొర్రెల పథకాన్ని ఇచ్చామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  ప్రశ్నిస్తూ వీటికి డబుల్ ప్రయోజనాలు ఇవ్వగలరా అని చాలెంజ్ చేశారు. 

ఇతర పార్టీల ప్రతినిధులు.. ఐక్యత, సామాజిక న్యాయం, సామాజిక సంస్కరణ, గొల్ల కురుమలు ఏకమయ్యే విధంగా వ్యూహాలు రచించాలని కోరారు. అందుకు వారి సహకారం ఉంటుందని తెలిపారు. అయితే ఇక్కడ చూడాల్సింది 10 సంవత్సరాల తెలంగాణ మోడల్.  దానిలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి, భాగస్వామ్యాన్ని చర్చించాల్సిన అవసరం ఉన్నది.

 బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనను 'తెలంగాణ మోడల్' రూపంలో ప్రజల ముందుకువెళ్ళింది. దురదృష్టవశాత్తు ఈ మోడల్​ను  ప్రజలు తిరస్కరించారు. అందుకు పలు కారణాలు ఉండొచ్చు. బీఆర్ఎస్ పాలనలో నాయకత్వం ఒకే కుటుంబం కేంద్రంగా ఉండటం తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు.

వ్యాపారంగా వైద్య సేవలు

వైద్యం వ్యాపారంగా మారింది.  ప్రభుత్వ దవాఖానాలలో ఎలాంటి సౌకర్యాలు లేక ప్రజలు ప్రైవేట్ వైద్యం వైపు మొగ్గు చూపారు.  వైద్య సేవలు వ్యాపారంగా మార్చడం గత ప్రభుత్వ ప్రత్యేకతగా చూడొచ్చు. రాష్ట్రంలో లక్షలలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయుటకు ప్రభుత్వం నిరాకరించింది. ఉపాధి లేక నిరుద్యోగులు పలు బాధలతో నైతిక హింసకు గురయ్యారు. కొన్ని పథకాలతో  ప్రజలను బీఆర్ఎస్ ముఖ్యమంత్రిపై ఆధారపడే విధంగా సుమారు10 ఏండ్లు పాలించారు. ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ, ఆదరణ చూపలేదు.

  ప్రజలను స్కీంల రూపంలో మలుచుకొని మళ్ళీ అధికారానికి రావొచ్చని అనుకున్నారు. దీన్ని గమనించిన  ప్రజలు కేసీఆర్​ సర్కారును కూల్చివేశారు. తెలంగాణ మోడల్​లో భాగంగా కొందరు నాయకులు వందల, వేల ఎకరాల పట్టణ భూములను కబ్జా చేసి ఆత్మగౌరవ భవనాలకు కొన్ని ఎకరాలు ఇవ్వడం అభివృద్ధి మోడల్ అవుతుందా..  విద్య, వైద్యం, ఉపాధిని ఏమాత్రం పట్టించుకోకుండా బంగారు తెలంగాణ అనడం సరికాదు. 

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి

తెలంగాణ ప్రజలు కులగణన కావాలని ఎన్నో సంవత్సరాలుగా నినదిస్తే 'బీసీ గణన' రిజర్వేషన్ అసెంబ్లీలో తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపడం సామాజిక తెలంగాణను అడ్డుకోవడమే. పంచాయతీరాజ్ వ్యవస్థలో అదేవిధంగా మున్సిపల్ సంస్థలలో 34% గా ఉన్న బీసీ రిజర్వేషన్లు 18 శాతానికి తగ్గించడం బీసీలను ఉద్దేశ పూర్వకంగానే అధికార భాగస్వామ్యాన్ని అడ్డుకోవడమే కదా. జనాభా నిష్పత్తి ప్రకారం అధికారంలో భాగస్వామ్యం కల్పించడం, అవకాశాలలో వాటాను అందించడం, వ్యాపారం, పరిశ్రమలలో, వనరులలో భాగస్వామ్యం కల్పించడం సామాజిక న్యాయం అవుతుంది. 

 ఎదిగిన కులాల పాలనలో కింది కులాల నాయకులు ఆధిపత్య స్పృహకు అనుగుణంగా మాట్లాడి బీసీలను, దళితులను, ఆదివాసీ, మైనారిటీలను సంపదలో భాగం కాకుండా ఉంచడం పాలక కుల నాయకుల సోషల్ ఇంజినీరింగ్ అవుతుంది. రాష్ట్ర ప్రజలు కోరుకునేది  అగ్రకుల నాయకుల సోషల్ ఇంజినీరింగ్ కాదు. వారి అవకాశాలను పెంచుతూ, అధికారంలో భాగస్వామ్యం చేస్తూ, అభివృద్ధి వైపు నడిపిస్తూ,  సామాజిక మార్పు,  సామాజిక పరివర్తన, సమానత్వంతో కూడిన డిగ్నిటీని. సెల్ఫ్ రెస్పెక్ట్​ను ప్రమోట్ చేయడమే సామాజిక న్యాయం అవుతుంది.  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అటువైపు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం విస్మరించినా చరిత్ర పునరావృతం కావొచ్చు.

బంగారు తెలంగాణ పేరిట అక్రమాలు

బంగారు తెలంగాణ  ప్రచారంతో  పలు అక్రమాలకు పాల్పడి వనరుల దుర్వినియోగానికి పూనుకోవడం  ప్రజలు సహించలేదు. బీఆర్ఎస్ నాయకత్వం వారి చుట్టూ ఉన్న సొంత సామాజిక వర్గాల దోపిడీ సహించలేక ఆ పార్టీని ప్రజలు ఓడించారు.   వందల, వేల ఎకరాలు ధరణి రూపంలో నాయకుల పేర పట్టాలు చేసుకోవడం తీవ్ర దోపిడీ పాలనగా కనిపిస్తుంది. ఇసుక దోపిడీ, కాంట్రాక్టర్ల అక్రమాలు, మనం ప్రతిరోజు వింటున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ  బ్రిడ్జికి పగుళ్లు పట్టి కూలిపోయే స్థితిని రాష్ట్రం మొత్తం గమనిస్తున్నది. 

బెల్ట్ షాపుల రూపంలో లిక్కర్​ గ్రామీణ కుటుంబాలకు తీవ్ర నష్టం చేసింది. తెలంగాణ నిర్మాణానికి కీలకమైన అంశం విద్య.  కానీ,  బీఆర్ఎస్  ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఏనాడు విద్యను సమీక్షించలేదు, అభివృద్ధికి పాల్పడలేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఏర్పడిన మొదట్లో 11% గా ఉన్న బడ్జెట్​ను 6 శాతానికి తగ్గించడం ఆ పాలకుల విధ్వంస మనోభావనను తెలుపుతున్నది. 6,000 పైచిలుకు ప్రభుత్వ స్కూళ్లను మూసివేయడం అభివృద్ధి అవుతుందా?.  ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు నియామకాలు లేకపోవడం విద్యపట్ల వారి వైఖరిని తెలియజేస్తోంది.

- ప్రొఫెసర్  సింహాద్రి సోమనబోయిన
రాష్ట్ర అధ్యక్షుడు,సమాజ్​వాది పార్టీ