2024 ఎన్నికల వార్‌‌ @ ఆన్​లైన్​

2024 ఎన్నికల వార్‌‌ @ ఆన్​లైన్​

ప్రస్తుత  సమాజంలో సోషల్‌‌ మీడియా లేని ప్రపంచాన్ని ఊహించలేం. ఏ విషయాన్ని అయినా విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు మన సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఒక వేదికగా సోషల్‌‌ మీడియా అందరికీ చేరువవుతోంది. సోషల్‌‌ మీడియా ప్రాధాన్యతను పసిగట్టిన రాజకీయ పార్టీలు దీనికి సంబంధించిన అన్ని ప్లాట్‌‌ఫాంలను విరివిగా వినియోగించుకుంటూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయాలలో సోషల్‌‌ మీడియాను ఎంత ఉపయోగించుకుంటే ఆయా పార్టీలకు అంత ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఈ సోషల్‌‌ మీడియా యుగంలో 2024 సార్వత్రిక ఎన్నికల వార్‌‌లో ఆన్‌‌లైన్‌‌ కీలకపాత్ర  పోషించనుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత యూ ట్యూబ్‌‌ చానల్‌‌ సబ్​స్ర్కైబర్స్​ సంఖ్య ఇటీవల 2 కోట్లు దాటింది. ప్రపంచ అధినేతల్లో మోదీకే అత్యధికంగా సబ్​స్ర్కైబర్స్​ ఉన్నారు. దాదాపు ప్రతి సందేశాన్ని ఆయన తన యూ ట్యూబ్‌‌ చానల్​ ద్వారా పంపిస్తున్నారు. గత డిసెంబర్‌‌లో ఆయన యూ ట్యూబ్‌‌ చానల్‌‌కి సుమారు 23 కోట్ల వ్యూస్‌‌ వచ్చాయి. ఇది మన దేశ సమాచార వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మక మార్పుకు ఒక సంకేతం. రాజకీయ గోల చేసే సంప్రదాయ టీవీ చానళ్ల నుంచి ప్రేక్షకులు దూరం జరుగుతున్నారు. టీవీలో, పేపర్‌‌లో వాళ్లు ఇచ్చిందే చూడాలి. డిజిటల్‌‌ మీడియాలో అయితే తమకు నచ్చింది చూసే అవకాశం ఉండటంతో యూ ట్యూబ్‌‌, ఫేస్‌‌ బుక్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్‌‌, ఎక్స్​ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు నెట్‌‌ ఫ్లిక్స్‌‌, అమెజాన్‌‌ ప్రైమ్‌‌, డిస్నీ హాట్‌‌ స్టార్‌‌, జియో సినిమా వంటి ఓటీటీ చానళ్లను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌కు అధికారం రావడంలోనూ డిజిటల్‌‌ మీడియా కీలక పాత్ర పోషించింది. 130 కోట్లకు పైగా ఉన్న మన దేశ జనాభాలో సుమారు 75 కోట్ల మంది స్మార్ట్‌‌ ఫోన్లు ఉపయోగిస్తున్నారు.

తెలంగాణలో సుమారు 59 శాతం మంది స్మార్ట్‌‌ ఫోన్‌‌ వినియోగిస్తున్నారు. వీరిలో అత్యధిక శాతం 1980 తర్వాత పుట్టిన మిలేనియల్స్‌‌ (జనరేషన్​ వై), 1995 తర్వాత పుట్టిన జనరేషన్​ జెడ్‌‌  సమాచారం కోసం డిజిటల్‌‌ మీడియానే ఆశ్రయిస్తున్నారు. పీపుల్స్‌‌ పల్స్‌‌ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ఒక సమస్యను అర్థం చేసుకోవడానికి, ఆ సమస్యపై అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి యూ ట్యూబ్‌‌ చూస్తామని పలువురు చెప్పారు. వీరిలో ఎక్కువమంది తమ భావాలకు అనుగుణంగా ఉండే యూ ట్యూబ్‌‌ చానల్స్‌‌ చూస్తున్నారు. ఈ మార్పును పసిగట్టిన రాజకీయ పార్టీలు సొంత మీడియా కంటే, డిజిటల్‌‌ మీడియా
పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి.

వార్​ రూమ్​ నుంచి సమాచారం

ప్రధాన పార్టీల వార్‌‌ రూమ్‌‌ నుంచి వచ్చే ప్రతి సమాచారాన్ని తమ అధికారిక సోషల్‌‌ మీడియా ఖాతాలు, యూ ట్యూబ్‌‌ నుంచే పంపిస్తున్నారు. దేశవ్యాప్తంగా యూ ట్యూబ్‌‌లో బీజేపీకి సుమారు 51 లక్షలు, కాంగ్రెస్‌‌కి 38 లక్షల మంది సబ్​స్ర్కైబర్స్​ఉన్నారు. తెలంగాణలో బీఆర్‌‌ఎస్‌‌కి లక్షా పదివేలు, బీజేపీకి 24 వేలు, కాంగ్రెస్‌‌కి 20 వేల సబ్​స్ర్కైబర్స్​ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌‌లో టీడీపీకి సుమారు 3 లక్షలు, వైఎస్సార్సీపీకి 4 లక్షలు, జనసేనకు 13 లక్షల సబ్​స్ర్కైబర్స్​ఉన్నారు. వీటికి తోడు దేశంలోని ప్రతి ప్రధాన పార్టీకి  రకరకాల పేర్లతో సుమారు 500 వరకు ఇన్‌‌స్టాగ్రామ్‌‌ హ్యాండిల్స్‌‌ ఉన్నాయి. వాట్సాప్‌‌లో కంటెంట్‌‌ని నిరంతరం షేర్‌‌ చేయడం కోసం ఆయా పార్టీలు పెద్దఎత్తున వాలంటీర్లను కూడా నియమించుకుంటున్నాయి. 

అందరికంటే ముందు సోషల్‌‌ మీడియా ఆయుధాన్ని వాడటం మొదలుపెట్టిన బీజేపీకి దానికి రెండు వైపులా పదునుందని బాగా తెలుసు. బీజేపీకి మేలు చేస్తున్న ఆ కత్తి కీడు కూడా చేయగలదని ఆ పార్టీ గుర్తించింది. అందుకే, బ్రాడ్‌‌ కాస్టింగ్‌‌ రెగ్యులేషన్‌‌ బిల్లు-2023 ద్వారా డిజిటల్‌‌ న్యూస్‌‌, ఓటీటీ కంటెంట్‌‌ని సెన్సార్‌‌ షిప్‌‌ చేయాలనుకుంటోంది. చైనా కూడా ఇలాంటి సెన్సార్‌‌ ప్రయత్నాలు చేసి సఫలం కాలేకపోయింది. ఎలక్ట్రానిక్‌‌ మీడియా విచ్చలవిడితనాన్ని అడ్డుకోలేకపోతున్న నియంత్రణ సంస్థలు, డిజిటల్‌‌ మీడియాను కట్టడిచేయడం కష్టసాధ్యమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నాయి. రాబోయే లోక్‌‌సభ ఎన్నికల్లో బహిరంగ సభలు, రోడ్‌‌షోలు, టీవీ చర్చలకే పరిమితం కాకుండా సోషల్‌‌ మీడియాకు రాజకీయ పార్టీలు అధిక ప్రాధాన్యతనిఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల వార్‌‌ ఆన్‌‌లైన్‌‌లో హోరాహోరీగా జరగబోతోంది.

యూ ట్యూబ్​ చానల్స్​ తీవ్ర ప్రభావం

ఎన్నికల్లో గెలవడానికి 32 మెడికల్‌‌ కాలేజీల కంటే, ఫేక్‌‌ న్యూస్‌‌ ప్రచారాన్ని అడ్డుకోవడానికి32 యూ ట్యూబ్‌‌ చానల్స్‌‌ పెట్టుకోవాల్సింది అని ఇటీవల బీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌  కే.తారక రామారావు వ్యాఖ్యానించారు. వాస్తవానికి అలాంటి యూ ట్యూబ్‌‌ చానల్స్‌‌ ప్రభావం చాలా తక్కువ. తెలంగాణ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌కి వందలాది యూట్యూబ్‌‌ చానల్స్‌‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చాయి. కానీ, ప్రేక్షకులు ఇలాంటి యూ ట్యూబ్‌‌ చానళ్లని చూడటానికి ఇష్టపడటం లేదు. బీఆర్‌‌ఎస్‌‌పై ప్రజా వ్యతిరేకత కూడటగట్టడంలో పెద్ద పెద్ద టీవీ చానళ్ల కంటే, తీన్మార్‌‌ మల్లన్న నడుపుతున్న క్యూ న్యూస్‌‌, రఘు నడుపుతున్న మన తొలివెలుగు చానళ్లు కీలక పాత్ర పోషించాయి. వారి చానళ్లకు లక్షల్లో వ్యూస్‌‌ రావడంతో పాటు, వారి క్లిప్పింగ్స్‌‌ సోషల్‌‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌‌ అయ్యాయి. వీరు తమ యూ ట్యూబ్‌‌ చానల్స్‌‌లో చెప్పినవాటినే ప్రజలు కూడా తమ అభిప్రాయాలుగా చెప్పడం చాలా చోట్లా పీపుల్స్‌‌ పల్స్‌‌ బృందం గమనించింది. టీవీ చానళ్లలో 
24 గంటలు బలవంతంగా న్యూస్‌‌ జొప్పించి, ఎజెండా సెట్‌‌ చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ, సోషల్‌‌ మీడియాలో ఎంత కావాలంటే అంతే చెప్పేందుకు అవకాశం ఉంది. దీంతో తమకు కావాల్సిన కస్టమైజ్డ్‌‌ సమాచారం లేదా విశ్లేషణ కోసం ప్రేక్షకులు యూ ట్యూబ్‌‌ చానళ్లను చూస్తున్నారు.

డిజిటల్​ మీడియాపై యువత ఆసక్తి

ఒక పార్టీకి కొమ్ము కాసినట్టు ప్రేక్షకులు అనుమానిస్తే, ఆ చానల్‌‌ నమ్మకాన్ని కోల్పోతుంది. ఒత్తిడికి లొంగకుండా నిష్పక్షపాతంగా వీడియోలు చేస్తున్న యూ ట్యూబర్స్‌‌ ద్వేషపూరితమైన కామెంట్స్‌‌, బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. మన దేశంలో 45 కోట్ల మంది అంటే జనాభాలో 32.8 శాతం మంది ప్రతి రోజూ యూ ట్యూబ్‌‌ చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీకి వచ్చిన ఓట్ల శాతానికి ఇది దాదాపు సమానం. యువత ఎక్కువగా డిజిటల్‌‌ మీడియాను వాడుతున్నట్టు అందరికంటే ముందు బీజేపీ గుర్తించింది. మొదటిసారి ఓటు వేసే వారిని ఆకర్షించడంలో బీజేపీ విజయం సాధిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఫేస్‌‌బుక్‌‌ని ఎక్కువగా ఉపయోగించుకున్న బీజేపీ, అక్కడ యూజర్స్‌‌ తగ్గడంతో యూ ట్యూబ్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్‌‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. మన దేశంలో పొలిటికల్‌‌ అప్డేట్స్‌‌ కోసం 40 శాతం మంది ఇన్‌‌స్టాగ్రాం, 26 శాతం యూ ట్యూబ్‌‌ , 17 శాతం ఎక్స్, 12 శాతం ఫేస్‌‌బుక్‌‌ మీద ఆధారపడుతుండగా, వార్తా విశ్లేషణకు మాత్రం అత్యధిక శాతం మంది యూ ట్యూబ్‌‌నే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌‌ కూడా సోషల్‌‌ మీడియాను బాగా ఉపయోగించుకుంటోంది. భారత్‌‌ జోడో యాత్ర సమయంలో రాహుల్‌‌ గాంధీ యూ ట్యూబర్స్‌‌కి ఎక్స్‌‌క్లూజివ్‌‌ ఇంటర్వ్యూలు ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల సమయంలో రేవంత్‌‌ రెడ్డి, బీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌, ఇటీవల నారా లోకేశ్‌‌ కూడా యూ ట్యూబర్స్‌‌కి  ఇలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చారు.

యూ ట్యూబర్స్ కీలక పాత్ర

మెయిన్‌‌ స్ట్రీమ్‌‌ జాతీయ న్యూస్‌‌ చానళ్ల కంటే కూడా హిందీలో కోటిన్నర సబ్​స్ర్కైబర్స్​ ఉన్న ద్రూవ్‌‌ రాథే యూట్యూబ్‌‌ చానల్‌‌నే ఎక్కువ మంది చూడటం దీనికి తార్కాణం. ఆయన దేశంలో జరిగే కరెంట్‌‌ ఎఫైర్స్‌‌ పైన, రాజకీయ అంశాలపై వీడియోలు చేస్తారు. ఇలాంటి వీడియోలనే తెలుగులో ప్రొఫెసర్‌‌ నాగేశ్వర్‌‌, తులసి చందు, వీక్షణం ఎడిటర్‌‌ ఎన్‌‌. వేణుగోపాల్‌‌, సి.వనజ లాంటి ఇండిపెండెంట్‌‌ జర్నలిస్టులు వీడియోలు చేస్తున్నారు. వీరిపై ప్రజలకు విశ్వసనీయత ఉండడంతో ఈ వీడియోలకు ఆదరణ లభిస్తోంది. వీరితో పాటు కేవలం కొన్ని పార్టీల భావజాలాల్ని వ్యాప్తి చేసే యూ ట్యూబర్స్‌‌ కూడా ఉన్నారు. ఆయా భావజాలాల్ని ఇష్టపడే లక్షలాది మంది ఆ చానళ్లకు ప్రేక్షకులుగా ఉంటున్నారు. పలు రాజకీయ పార్టీలు ఇండిపెండెంట్‌‌ యూ ట్యూబర్స్‌‌ని తమవైపు తిప్పుకుని, తమకు అనుకూలమైన అభిప్రాయాలను ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ, యూ ట్యూబర్స్‌‌ ఒక పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నట్టు కనిపిస్తే, వారికి వ్యూస్‌‌ తగ్గుతున్న సందర్భాలు కూడా అధికంగానే ఉన్నాయి. ఇండిపెండెంట్‌‌ యూ ట్యూబర్స్‌‌నే అధిక శాతం మంది ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.

జంపాల ప్రవీణ్‌‌,రీసెర్చర్‌‌, పీపుల్స్‌‌పల్స్‌‌ రీసెర్చ్‌‌ సంస్థ