సోషల్ మీడియా వచ్చాక వార్త స్రవంతిలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. న్యూస్, సమాచారం క్షణాల్లో యూజర్లకు చేరిపోతున్నాయి. పత్రిక, టీవీ కంటే సోషల్ మీడియా ద్వారానే వార్తల వినియోగం పెరిగింది. రాయిటర్స్ ఇన్‌స్టిట్యూట్ డిజిటల్ న్యూస్ రిపోర్ట్ 2024 ప్రకారం భారతీయుల్లో దాదాపు 71% మంది వార్తల కోసం ఆన్‌లైన్‌పై ఆధారపడుతున్నారు. 91% జెన్ జీ... న్యూస్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారని గూగుల్- కాంతర్ నివేదిక పేర్కొంది.
అయితే, ఇదే అదనుగా యూట్యూబ్ చానళ్లు, వెబ్ పోర్టల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారిపోతున్నాయి. వ్యూస్, డబ్బుల కోసం యూట్యూబ్ చానళ్లు పెడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. తప్పుదోవ పట్టించే సమాచారం, అశ్లీలత వంటి వాటితో వీడియోలు రూపొందిస్తున్నారు.
తప్పుడు సమాచారం వ్యాప్తిచేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీనిపై ఎలాంటి నియంత్రణ, కంప్లైంట్ వ్యవస్థ లేకపోవడంతో విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. క్రింజ్ వీడియోలు చేసేవారితో ఇంటర్యూలు చేయడం... అందులో అశ్లీలత, మరికొంత మంది విద్వేషం పెంచేలా వీడియోలు రూపొందించడం సర్వసాధారణమైపోయింది.
వీటితోపాటు మెయిన్ స్ట్రీమ్ వెబ్ పోర్టల్స్ సైతం.. కంటెంట్ రైటర్లకు నెలవారి వ్యూస్ టార్గెట్స్ పెట్టి... ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తలను వండి వడ్డిస్తున్నాయి.
వైరల్ వీడియోలతో తప్పుదోవ
ఓ పులి మనిషిని లాక్కుపోతున్న వీడియోను మరో ఛానల్ న్యూస్ డిస్కషన్లో టెలికాస్ట్ చేసింది. అసలు విషయం ఏంటంటే అది కూడా ఫేక్. ఓ వెబ్‌పోర్టల్ పైరసీ పోర్టల్‌లో వచ్చే సినిమాలపై అప్ డేట్స్ ఇస్తూ ఆ పైరసీని పోర్టల్‌ను ప్రమోట్ చేస్తూ తరిస్తోంది. '56వేలు తగ్గిన బంగారం ధర' అంటూ క్లిక్ బైట్హెడ్లైన్స్ పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.
మీ దగ్గర పాతనోట్లు ఉంటే రూ.30– 40 లక్షలు సంపాదించవచ్చు అంటూ ఓ వెబ్‌పోర్టల్ ఇప్పటివరకు 10–15 వార్తలను పబ్లిష్ చేసింది. వైరల్ వీడియోలను నమ్ముకొని అది ఎంతవరకు నిజమనేది రూఢీ చేసుకోకుండానే వాటిపై వార్తలను ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించి ఆ చానల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి.
ఇటీవల ఓ సింగర్ పై సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తూ దుర్భాషలాడుతున్న వీడియోను సీపీ సజ్జనార్‌కు ట్యాగ్ చేస్తూ ఆమె ట్వీట్ చేసింది. అయితే ఆ వార్తను రాస్తూ ఓ వెబ్ పోర్టల్ అందులోని బూతులనే హెడ్‌లైన్‌గా పెట్టి వికృతానందం పొందింది. వీటన్నింటికి కారణం మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే అనే నిర్లక్ష్యం.
వెబ్‌పోర్టల్స్, యూట్యూబ్‌లో వచ్చే వార్తల్లో నిజమెంత అని ఫ్యాక్ట్ చెక్ చేసుకునే అవకాశం సాధారణ ప్రజలకు లేదు. అవి నిజమే అని నమ్మేవారి సంఖ్యే ఎక్కువ. ఫేక్ న్యూస్ వల్ల సమాజంలో గందరగోళం, ద్వేషం, అప నమ్మకం పెరుగుతున్నాయి. ఈ ప్రభావం ప్రధాన మీడియాపై పడితే అది ప్రజాస్వామ్యంలో ప్రమాదకర పరిణామం.
మానిటరింగ్ వ్యవస్థ రావాలి
భారత రాజ్యాంగంలోని 19(1)(a) అధికరణ ప్రకారం ‘వ్యక్తి స్వేచ్ఛగా అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు’. కానీ, అదే స్వేచ్ఛ తప్పుదారి పట్టించే సమాచారానికి కవచం అవకూడదు. ఐటీ చట్టం 69A, 79వ సెక్షన్లు ఫేక్ న్యూస్, మిస్‌లీడింగ్ కంటెంట్‌పై చర్యలు తీసుకునే అధికారం ఇస్తున్నప్పటికీ, వాటి అమలు, ఫిర్యాదు వ్యవస్థలు అందుబాటులో లేవు.
సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న తరుణంలో ప్రజలను తప్పుదోవ పట్టించి, వ్యూస్ కోసం వార్తలు రాసే చానళ్లు, వెబ్పోర్టల్స్పై మానిటరింగ్ వ్యవస్థ రావాలి. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవారిపై సులభంగా కంప్లైంట్ చేసేలా ఓ వ్యవస్థను రూపొందించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. సమాచారం శక్తిమంతమైనది.
కానీ తప్పుడు సమాచారం విధ్వంసం సృష్టిస్తుంది. మీడియా బాధ్యతాయుతంగా ఉండాలి. వ్యూస్ కోసం ఫేక్ న్యూస్ ప్రసారం చేసే ఈ డిజిటల్ ఛానల్స్‌ను అరికట్టాలంటే ప్రభుత్వం, మీడియా, ప్రజలు కలసి నడవాల్సిందే. నిజాలు తెలుసుకోవడం ప్రజల హక్కు. ఆ హక్కు ఫేక్‌న్యూస్ వల్ల కోల్పోవద్దు.
సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?
ఇటీవల మైనర్లతో యూట్యూబ్ చానళ్లు చేస్తున్న ఇంటర్వ్యూలను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో హైదరాబాద్ సీపీ సజ్జనార్ పోస్ట్ పెట్టారు. 'చిన్నారులతో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? చిన్నారులు, యువతకి స్ఫూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి సమాజాభివృద్ధికి దోహదం చేయండి.
అంతేకానీ, ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించవద్దు' అని హితవు పలికారు. సదరు యూట్యూబ్ చానళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
-
వంగరి రవిరాజు,జర్నలిస్ట్
