ధరణి పోర్టల్‌ను తొలగిస్తేనే సామాజిక తెలంగాణ ఏర్పడ్తది : భట్టి విక్రమార్క

ధరణి పోర్టల్‌ను తొలగిస్తేనే సామాజిక తెలంగాణ ఏర్పడ్తది : భట్టి విక్రమార్క

ధరణి పోర్టల్ ను తొలగిస్తేనే సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధరణి అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క... ధరణి పోర్టల్ తో ఎదురవుతోన్న సమస్యలపై ఇప్పటికే టీపీసీసీ ఆధ్వర్యంలో సర్వే ప్రారంభమైందన్నారు. ఈ కార్యక్రమానికి భట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, పొన్నం ప్రభాకర్, మల్లు రవి ఇతర నేతలు పాల్గొన్నారు. ఉత్పత్తి రంగం కొద్దిమంది చేతుల్లో ఉంటే.. మిగతా ప్రజలు వారిపై ఆధారపడాల్సి ఉంటుందని భట్టి చెప్పారు. గతంలో భూమి ఒక్కటే ఉత్పత్తి రంగంగా ఉండేదని... కాంగ్రెస్  పేద ప్రజలకు  భూమిని పంచిన చరిత్ర కూడా కాంగ్రెస్ దేనని గొప్పగా చెప్పారు. 

తెలంగాణలో ఏ పోరాటం చూసినా... భూమికోసం జరిగినవేనని భట్టి విక్రమార్క అన్నారు. స్వతంత్ర భారతదేశంలో పోరాటాల లక్ష్యాలకు భిన్నంగా రాష్ట్రంలో చట్టాలు తీసుకొచ్చారని చెప్పారు. పేదలకు పంచిన భూములను ధరణి చట్టంలోకి రాకుండా పక్కనబెట్టారని ఆరోపించారు. వారికి పాస్ బుక్ లు, పట్టాలు ఇవ్వడంలేదన్న ఆయన.. కాస్తు కాలమ్ ను తొలగించి భూమిని భూస్వాములకు అప్పగించారని ఆరోపణలు చేశారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో కేసీఆర్ ను నిలదీశామన్న భట్టి.. ఫ్యూడల్ వ్యవస్థను, భూస్వామ్య విధానాన్ని బీఆర్ఎస్ మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే... కాస్తు కాలమ్ తో పాటు ఇతర కాలమ్స్ ను మళ్లీ చేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.