
సామా ఎల్లా రెడ్డి. ఈయన 2004 నుంచి 2012 వరకు స్పెయిన్ , అమెరికా, దుబాయ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేశాడు. విలాసవంతమైన జీవితం.. లక్షల్లో జీతం. స్పెయిన్ లో ఉండగా అక్కడి అధ్యాత్మిక సంస్థలతో ఆయనకు పరిచయం ఏర్పడింది. దాంతో ఆయనలో మార్పు మొదలైంది. ‘దేశం కాని దేశం..రొటీన్ ఉద్యోగం.. ఇక్కడ ఎన్ని రోజులున్నా ఒంటరి జీవితమే’ అనుకున్నాడు. సొంత దేశంలో వచ్చేద్దా మని నిర్ణయిం చుకున్నాడు. కానీ, వచ్చి ఏం చేయాలో తెలియదు. అప్పుడే ఆయనకో ఆలోచన వచ్చింది. అదే ‘సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం’.
సిద్దిపేట, వెలుగు మల్లారెడ్డిది కరీంనగర్ జిల్లా లింగంపేట. ఆయనకు వ్యవసాయం చేయాలన్న ఆలోచన రావడం ఆలస్యం స్వదేశానికి వచ్చేశాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం విశ్వనాథపల్లి గ్రామంలో ఆరెకరాల వ్యవసాయ భూమి కొన్నాడు. అక్కడ పాతిక ఆవులతో గోశాల ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా ఐదంచెల పండ్ల తోట సాగు మొదలుపెట్టాడు. పాలీహౌజ్ను ఏర్పాటు చేసి జెర్బరా పూల సాగు చేశాడు. ఆ తర్వాత పూర్తి సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలకున్నాడు. దాంతో తన పొలానికి ఆనుకుని ఉన్న మరో పన్నెండు ఎకరాలు, కొండపాక మండలం మర్పడగ గ్రామంలో పన్నెండు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఆ భూమిలో చిరుధాన్యాలతోపాటు అనేక రకాల పంటలు సాగు చేస్తున్నాడు. ఇలాంటి ఆలోచనలతోనే ఉన్న మరికొందరితో ‘కమ్యూనిటీ ఫామింగ్ ’ను ఏర్పాటు చేసి తన ఆలోచనలను పంచుకుంటున్నాడు.
ఐదంచెల్లో వ్యవపాయం
ఎల్లారెడ్డి ప్రస్తు తం ఐదంచెల పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు. ఇది ప్రముఖ వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ సూచించిన విధానం. ఈ విధానంలో అన్ని కాలాల్లో ఏదో ఒక పంట చేతికొస్తుంది. భూమి లోపల పండే పంటలు, ఉపరితలంపై పండేవి, తీగ జాతి పంటలు, తక్కువ సమయంలో చేతికందేవి, రెండు సంవత్సరాల్లో కాతకు వచ్చే పంటలు సాగు చేస్తున్నాడు. వాటితో ఈ సీజన్ .. ఆ సీజన్ కాకుం డా అన్ని సీజన్ లలో ఆదాయం పొందుతున్నాడు.
పండ్ల తోటల అడవి
తన వ్యవసాయ క్షేత్రంలో ఎకరాలో పండ్ల తోటలతో చిన్నపా టి అడవినే పెంచుతున్నాడు. అరటి, అల్ల నేరేడు, మామిడి, దానిమ్మ, సపోట, బొప్పాయి తోటలను ఒకే పొలంలో పెంచుతుండటంతో చూడగానే అది అచ్చం అడవిలా కనిపిస్తుంది. సంవత్సరంలో ప్రతి రోజూ ఏదో ఒక రకమైన పండ్లు కాస్తూనే ఉంటాయి. వాటిని సిద్దిపేటలోని ‘ఆహార యోగ’ కేంద్రంలో అమ్ముతున్నాడు.
మిల్లెట్స్ సాగులోకి
ప్రస్తుతం ప్రజల్లో మిల్లెట్స్ ఉపయోగాలపై అవగాహన పెరిగింది. దీర్ఘకాలిక రోగాల నుంచి సాంత్వన కోసం ఎక్కువ మంది
చిరుధాన్యాలు తింటున్నారు. దాంతో వాటికి డిమాండ్ బాగా పెరిగింది. అందుకే ఎల్లారెడ్డి మర్పడగ వద్ద కౌలుకు తీసుకున్న పన్నెండు ఎకరాల్లో సామలు, కొర్రలు, ఊదలు, అరికెలు పండిస్తున్నాడు. అది కూడా సేంద్రియ పద్ధతుల్లో . ఎల్లారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి ఎంత డిమాండ్ ఉందంటే.. హైదరాబాద్ నుంచి వచ్చి మరీ చిరుధాన్యాలు కొంటున్నారు వ్యాపారులు. ఈ చిరుధాన్యాల మొక్కల ద్వారా వచ్చే గడ్డిని గోశాలలోని ఆవులకు ఆహారంగా వేస్తాడు ఎల్లారెడ్డి.
గోశాల
వ్యవసాయ క్షేత్రంలో దేశీ గిరి జాతి ఆవులతో గోశాలను ఏర్పాటు చేశాడు. వీటి ద్వారా ప్రతి రోజు 30 లీటర్లకు పైగా పాల ఉత్పత్తి జరుగుతుంది. వాటిని ‘ఆహార యోగ’లో అమ్ముతున్నాడు. ఆవుల వ్యర్థా లతో ఎరువులు తయారు చేస్తూ పంటలకు వేస్తు న్నాడు.
నెయ్యి తయారీ
గోశాలలోని ఆవుల పాలతో సంప్రదాయ పద్ధతుల్లో నెయ్యిని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. వెన్న, మీగడలను సంప్రదాయ పద్ధతుల్లో పిడకల మంటపై వేడిచేసి కమ్మని నెయ్యిని తయారు చేస్తారు. ముఖ్యంగా పెరుగును చిలికేటప్పుడు పూర్వంలో లానే మట్టి కుండలు, చెక్కతో చేసిన కవ్వాలను వాడతారు.
రైతు నేస్తం అవార్డు
సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తు న్న ఎల్లారెడ్డికి 2016లో ‘రైతునేస్తం ఫౌండేషన్’ అవార్డు దక్కింది. అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నుంచి ఈ అవార్డును అందుకున్నాడు. 2017లో గంప నాగేశ్వరరావు ఫౌండేషన్ నుంచి కూడా అవార్డువచ్చింది.