
హిమాచల్ సోలన్ జిల్లాలో ప్రమాదం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు బహుళ అంతస్తుల రెస్టారెంట్ భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకుపోయి ఇద్దరు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ఒక జవాను ఉన్నట్లు సోలన్ డిప్యూటీ కమిషనర్ కె.సి.చమన్ చెప్పారు. భవనం కూలిన సమయంలో మొత్తం 37మంది లోపల ఉన్నారు. వారిలో 23 మందిని బయటికి తీసుకొచ్చిన ఆర్మీ సిబ్బంది వారిని దగర్లోని ఆస్పత్రికి తరలించింది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. శిథిలాల్లో 12 మంది చిక్కుకుపోయారని, వారికోసం గాలిస్తున్నట్లు వివరించారు. గాయపడ్డ వారిలో 18 మంది ఆర్మీ జవాన్లు ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కుటుంబంతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్తున్న ఆర్మీ జవాన్లు భోజనం చేసేందుకు నహన్–కుమార్హట్టీ రోడ్డులోని రెస్టారెంట్కు వెళ్లారని, ఆ టైం ప్రమాదం జరిగిందని ఆర్మీ అధికారులు చెప్పారు.