సోమాలియాలో ఏడాదిగా వానే లేదు

సోమాలియాలో  ఏడాదిగా వానే లేదు

సోమాలియాలో మరోసారి కరువు వచ్చింది…సెప్టెంబర్ నాటికి కరువు పరిస్థితుల్లో మార్పులు రాకపోతే దాదాపుగా 20 లక్షల మందికి పైగా ప్రజలు తిండికి కటకట పడే అవకాశాలున్నాయి. ఆఫ్రికా దేశమైన సోమాలియాకు కరువు కొత్త కాదు. 2015లో దేశంలో  వానలు పడని పరిస్థితులు నెలకొన్నాయి. రెండేళ్ల పాటు వాన చుక్క పడలేదు. 2017 చివరిలో వానలు పడటంతో పరిస్థితి మారింది. సోమాలియా ప్రజలకు ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. రెండేళ్లకే  మళ్లీ  కరువు వచ్చింది అలా ఇలా కాదు చాలా తీవ్ర స్థాయిలో. గత 30 ఏళ్లలో  ఈ స్థాయిలో ఎప్పుడూ  కరువు రాలేదు. సోమాలియాలో పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉన్నా  ప్రపంచదేశాల నుంచి ఎలాంటి  రియాక్షన్ లేదు. ‘ క్లైమేట్ చేంజ్ ’ వల్లనే కేవలం రెండేళ్లకే  మరోసారి వానలు కురవని పరిస్థితి వచ్చిందని చెప్పి చేతులు దులుపుకునే  ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. అంతే తప్ప సోమాలియాను ఆదుకోవడానికి రావలసిన స్థాయిలో ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో  సోమాలియా పరిస్థితిని యునైటెడ్ నేషన్స్  సీరియస్ గా తీసుకుంది. సోమాలియాకు సాయం చేయడానికి ముందుకు వచ్చింది.

హ్యుమానిటేరియన్ వింగ్ ను రంగంలోకి దించింది. అనేక దేశాల నుంచి నిధులు పోగేయడానికి  టాప్ ప్రయారిటీ ఇచ్చింది.హ్యుమానిటేరియన్ వింగ్ కు చెందిన సిబ్బంది వివిధ దేశాల్లో పర్యటించి సోమాలియాను ఆదుకోవడానికి నిధుల సేకరణ మొదలెట్టారు. యునైటెడ్ నేషన్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా తక్కువ మొత్తంలో నిధులు పోగయ్యాయి. యునైటెడ్ నేషన్స్ టార్గెట్ గా అనుకున్న మొత్తంలో మే నెల చివరి నాటికి ఐదో వంతు మాత్రమే పోగయ్యాయి. రెండేళ్ల నుంచి సోమాలియాలో  క్లైమేట్ ఎమర్జెన్సీ అమలులో ఉంది. మారిన వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు  అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే ఇదొక్కటే సరిపోదు. సోమాలియా ను ఆదుకోవడానికి  ప్రపంచ దేశాలు ఒక ఉద్యమంలా ముందుకు రావాల్సి ఉంది. చుక్క నీరు పడని ఈ పరిస్థితుల్లో  ఆఫ్రికా దేశానికి బయటి నుంచి మద్దతు తప్పకుండా అవసరం అవుతుంది. అంతర్జాతీయ సంస్థలు ఎంతగా మొత్తుకున్నా  మిగతా దేశాల నుంచి అనుకున్న స్థాయిలో నిధులు అందలేదు.దీంతో కరువుకు బ్రేక్ వేయడానికి  పెద్ద స్థాయిలో చర్యలు చేపట్టలేకపోతోంది యునైటెడ్ నేషన్స్. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా  ముందుకు రావాలని కోరుతున్నారు మానవతావాదులు. తాగడానికి నీరు దొరకక లక్షలాది మంది ప్రజలు పక్క దేశాలకు వలసపోతున్నారు.

ఏడాది పొడవునా హై టెంపరేచరే

సోమాలియా క్లైమేట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దాదాపుగా ఏడాది పొడవునా హై టెంపరేచర్ ఉంటుంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడి వాతావరణం వానలకు ఏమాత్రం అనుకూలంగా ఉండదు. వానలు పడే సీజన్ కూడా తక్కువే ఉంటుంది. సీజన్ లో  కూడా వానలు సరిగా పడవు. చుట్టం చూపు గా వచ్చినట్లు వచ్చి వెళతాయి. దీంతో ఏడాది సగటు వర్షపాతం ఎప్పుడూ తక్కువగానే  ఉంటుంది.

సోమాలియాలో తరచూ కరువు రావడానికి  అక్కడ  నెలకొన్న హై  టెంపరేచర్లే ప్రధాన కారణమంటున్నారు  సైంటిస్టులు. కొన్ని వారాల కిందట సోమాలియాలో వానలు పడ్డాయి. అయితే ఇవి కేవలం కంటితుడుపే అన్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. పంటలు పండటానికి ఏమాత్రం పనికిరాని వానలు పడ్డాయన్నారు.

వ్యవసాయమే కీలకం

సోమాలియా ఆర్థిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైనది వ్యవసాయమే. జీడీపీలో 65 శాతం అగ్రికల్చర్ సెక్టార్ నుంచే వస్తుంది. తర్వాతి స్థానాల్లో ఫిషింగ్, ఫారెస్ట్రీ, పశు సంపద ఉంటాయి. జీడీపీలో 40 శాతం పశుసంపద నుంచి వస్తుంది. సోమాలియా నుంచి చేపలు, బొగ్గు, అరటి, చక్కెర, జొన్న, మొక్కజొన్న  బయటి దేశాలకు ఎగుమతి అవుతాయి.

తిండికి నోచుకోని 50 లక్షల మంది

సోమాలియాలో నెలకొన్న కరువు ఫలితంగా అక్కడి దాదాపు 50 లక్షల మందికి పైగా ప్రజలు తిండికి ఇబ్బందిపడుతున్నారు. యునైటెడ్  నేషన్స్ హ్యుమానిటేరియన్ వింగ్ ఈ విషయం వెల్లడించింది. అలాగే ఐదేళ్ల లోపు చిన్నారులు దాదాపు మూడు లక్షల మంది సరైన ఆహారం లేక నానా ఇబ్బందులు పడుతున్నారని యునైటెడ్ నేషన్స్ వివరించింది.

సోమాలియా తక్కువేం కాదు.. కానీ
సోమాలియా పై బయటి ప్రపంచంలో చాలా అపోహలు ఉన్నాయి. సోమాలియా పేరు వినగానే బీద దేశం అనుకుంటారు. అయితే ఇది కరెక్ట్ కాదంటున్నారు సోషల్ సైంటిస్టులు. ఆఫ్రికా ఖండంలో ఈశాన్య దిక్కున ఉన్న సోమాలియలో ఆయిల్ నిల్వలు ఎక్కువగా ఉంటాయి. ఆయిల్ నిల్వలను సరిగా ఉపయోగించుకుంటే సోమాలియా పరిస్థితి మరోలా ఉండేది. ఇక్కడ ప్రధాన సమస్య దేశాన్ని ముందుకు నడిపించే ఒక స్థిరమైన నాయకత్వం లేకపోవడమే. ఏ ప్రభుత్వమూ ఎక్కువ కాలం కొనసాగదు. ప్రభుత్వం పై  తిరుగుబాట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వాలు పడిపోవడం సర్వ సాధారణంగా ఉంటుంది. ఇస్లామిక్ టెర్రరిస్టులు కూడా సోమాలియాలో  పెద్ద సంఖ్యలో ఉన్నారు.  1991 లో  ప్రారంభమైన సివిల్ వార్ ఫలితంగా సోమాలియా తీవ్రంగా నష్టపోయింది. మిగతా ఆఫ్రికా దేశాలతో పోలిస్తే అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది. ఇప్పటివరకు ఐదు లక్షల మంది సివిల్ వార్ ఫలితంగా చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి.

తిరుగుబాట్లు ….అరాచకాలే
1960 జూన్ 26న యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ సోమాలియా ఏర్పడింది.1969 లో  మహమ్మద్ సియాద్ బారే  నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సోమాలియాను సోషలిస్ట్ దేశంగా బేరే ప్రకటించారు. దేశంలోని పెద్ద ఎత్తున రాబడి తెచ్చి పెట్టే వనరులను ఆయన జాతీయం చేశారు. 1991లో  మహమ్మద్ సియాద్ బారే  ప్రెసిడెంట్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అదే ఏడాది సివిల్ వార్ మొదలైంది. 2000లో ట్రాన్సిషనల్ నేషనల్ గవర్నమెంట్ ( టీఎన్ జీ ) ఏర్పడింది. తర్వాత 2004 లో ట్రాన్సిషన్ ఫెడరల్ గవర్నమెంట్ ( టీఎఫ్ జీ ) ఏర్పాటైంది.  2006 లో  ‘ ఇస్లామిస్ట్ యూనియన్ ఆఫ్ ఇస్లామిక్ కోర్ట్స్ ’ కు విధేయులైన మిలిటెంట్లు రాజధాని మొగదీషుతో పాటు  దక్షిణాన మరికొన్ని  ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. 2012 నాటికి తిరుగుబాటుదారులు తాము స్వాధీనం చేసుకున్న భూభాగంలోని చాలా ప్రదేశాలను కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో  దేశానికి ఒక స్థిరమైన రాజకీయ నాయకత్వం అందించడానికి జరిగిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి. ఆ తర్వాత ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరిగింది. ప్రపంచ దేశాల మద్దతు ఉన్న ఓ కొత్త ప్రభుత్వం సోమాలియాలో ఏర్పాటైంది. అయితే దేశంలో ఏ ప్రభుత్వమూ బలంగా లేదు. దేశంలో ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి ఎప్పుడూ పోరాటాల్లో ఉండేవారు. దీనికితోడు అల్ షబాబ్ టెర్రరిస్టులు దేశాన్ని అల్లకల్లోలం చేశారు. దీంతో సోమాలియాలో  ఎప్పుడు చూసినా అరాచకమే కనిపిస్తుంది.