ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్డా ప్రగతిభవనే.. టిఫిన్ నుంచి డిన్నర్ వరకు అక్కడే మకాం

ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్డా ప్రగతిభవనే..  టిఫిన్ నుంచి డిన్నర్ వరకు అక్కడే మకాం

కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు జనాల్లో కంటే ప్రగతిభవన్ లోనే ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నారట. రోజూ ప్రగతిభవన్ కు రావటం.. సాయత్రం వరకు అక్కడే ఉండటం అవసరమైతే రాత్రి దాక వెయిట్ చేసి వెళ్ళి పోవటమే వీళ్ల దినచర్య. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్మూర్ MLA జీవన్ రెడ్డి, చెన్నూరు MLA బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌషిక్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డితో పాటు ఇంకో పది, పదిహేను మంది లీడర్లు ప్రగతి భవన్ లోనే ఉంటున్నారట. వీళ్ల మధ్య ప్రగతి భవన్ లో తీవ్రమైన పోటీ ఉంటోందట.

ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ కళ్ళలో పడేందుకు ఈ ప్రజాప్రతినిధులు చేసే విన్యాసాలు చాలా విచిత్రంగా ఉంటాయట. KCR ఇంటి నుంచి ప్రగతి భవన్ కు వచ్చే టైం తెలుసుకోవడం.. ఆ సమయానికి అక్కడికి చేరుకొని..డోర్ దగ్గర నిలబడి సీఎం కేసీఆర్ కు నమస్తే చెప్పటంతోని వీళ్ల దినచర్య మొదలవుతుందట. కేసీఆర్ కు కనపడేలా ప్లాన్ చేసుకోవడం, బెల్ కొట్టగానే పోటీపడి పరిగెత్తడం, ఏ అధికారినైనా పిలవాలని CM చెప్తే.. వెంటపడి ఆ ఆఫీసర్ ని పిలిపించటం..ఇవే వీళ్ల డైలీ కార్యక్రమాలంట. ఇటువంటి పనుల్లో ప్రగతి భవన్ లో ఈ లీడర్లంతా పోటీ పడుతున్నారట.

ఈ పోటీలో నేతల మధ్య అప్పుడప్పుడు వివాదాలు కూడా వస్తున్నాయట. పరస్పరం అడ్డుకోవడాలపై మాటమాట అనుకుంటున్నారట. ఒకరికొకరు అడ్డుతగలకుండా ఉండేందుకు ప్లాన్ చేయడం కూడా ఇక్కడ కామన్ గా మారిందట. అప్పుడప్పుడు ఒకరిపై మరొకరు సీఎంకు ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నారట. CM సమక్షంలో ఎవరైనా పార్టీలో చేరితే..అక్కడ కూడా హంగామా చేస్తున్నారట. కండువాలు ఇచ్చేందుకు పోటీ పడుతున్నారట. ఫోటోలు దిగేటప్పుడు కూడా గులాబీ లీడర్లకు పోటీ తప్పడం లేదట.

మిగతా లీడర్లు MLA జీవన్ రెడ్డిని టార్గెట్ చేశారట. జీవన్ రెడ్డిని మహారాష్ట్రకు వెళ్ళొద్దని, ప్రగతి భవన్ కు రావొద్దని పార్టీ పెద్దలతో చెప్పించారట. అయినా.. ఆయన ప్రగతి భవన్ లోనే మకాం పెట్టారట. ఈ మధ్య మహారాష్ట్ర నాయకుల చేరికలు ప్రగతి భవన్ లో వరుసగా జరగడాన్ని MLA క్లైమ్ చేసుకుంటున్నారట. ఇది మిగతా లీడర్లకు మింగుడు పడటం లేదట. ఇదంతా తనపై కుట్రని కొట్టి పడేస్తున్నారట ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎన్నికల టైమ్ లో జనంలో ఉండాల్సింది పోయి.. ప్రగతి భవన్ లో వీళ్లకేం పని అని వాళ్ల నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట.