టెట్రా ప్యాకెట్‌‌ పాల టెండర్లలో మాయాజాలం

టెట్రా ప్యాకెట్‌‌ పాల టెండర్లలో మాయాజాలం
  • టెట్రా ప్యాకెట్‌‌ పాల టెండర్లలో మాయాజాలం
  • జీవోకు విరుద్ధంగా టెండర్ నిబంధనలు
  • విజయ డెయిరీకి దక్కకుండా రూల్స్​లో మార్పు
  • కేవలం రెండు సంస్థలకే దక్కేలా టెండర్లు
  • అంగన్​వాడీలకు పాల సరఫరాలో ఐసీడీఎస్‌‌ కొనుగోల్​మాల్​
  • పాడిరైతులకు, ప్రభుత్వ సంస్థకు శాపం

హైదరాబాద్‌‌, వెలుగు : అంగన్​వాడీలకు ప్రతిరోజు సరఫరా చేసే పాల కొనుగోళ్లలో కొందరు అధికారులు అక్రమాలకు తెరలేపారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీని కాదని ఇతర రాష్ట్రాల నుంచి టెట్రాప్యాక్‌‌ పాలను దిగుమతి చేసుకునేందుకు ఐసీడీఎస్‌‌(ఇంటిగ్రేటెడ్​చైల్డ్​డెవలప్​మెంట్​స్కీం) ప్రయత్నిస్తున్నది. ఇక్కడి రైతుల ఆదాయానికి గండిపడేలా వందల కోట్ల రూపాయల విలువైన టెండర్లు తమకు నచ్చిన సంస్థకు కట్టబెట్టేలా రూల్స్ మార్చడం విమర్శలకు తావిస్తోంది.

ప్రతినెల 30లక్షల లీటర్లు

ఐసీడీఎస్‌‌ ద్వారా రాష్ట్రంలోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పాలను టెట్రాప్యాక్‌‌ల రూపంలో ప్రభుత్వం అందిస్తున్నది. ఒక్కొక్కరికి రోజుకు 250 మిల్లీలీటర్ల పాలు ఇస్తారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రోజు లక్ష లీటర్ల చొప్పున నెలకు 30 లక్షల లీటర్ల టెట్రాప్యాక్‌‌ పాలు అవసరం. దీని కోసం ప్రతి ఏటా టెండర్లు పిలిచి మిల్క్‌‌ ఫెడరేషన్‌‌ల నుంచి పాలను సేకరించి, పారదర్శకంగా సరఫరా చేయాల్సి ఉంటుంది.

నచ్చిన సంస్థకు వచ్చేలా టెండర్ ​రూల్స్!

ఇటీవల పిలిచిన టెండర్లలో రూల్స్ ఇతర రాష్ట్రాలకు చెందిన రెండు సంస్థలకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. విజయ డెయిరీ, రాష్ట్రంలోని ఇతర పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను అనర్హులను చేసేలా రూల్స్ మార్చి దేశవ్యాప్తంగా రెండు సంస్థలకు మాత్రమే వర్తించేలా టెండర్ రూల్స్ రూపొంచిందినట్లు తెలుస్తున్నది. ఈ రెండింటిలో ఒక సంస్థ సర్కారు సంస్థలకు పాలు సరఫరా చేయడానికి సుముఖంగా లేకపోవడంతో కర్నాటకకు చెందిన మరో సంస్థకే అనుకూలంగా రూల్స్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. విజయ డెయిరీ వర్గాలు టెండర్‌‌ నిబంధనలు సడలించి తమను టెట్రాప్యాక్‌‌ పాల సరఫరాకు అనుమతించాలని కోరినా ఐసీడీఎస్ పట్టించుకోవడం లేదని సమాచారం.

విజయ టెట్రా మెషీన్‌‌ మూలకేనా?

తాజా టెండర్‌‌ నిబంధనలతో విజయ టెట్రా మెషీన్‌‌ పనే లేకుండా మూలన పడే పరిస్థితి ఏర్పడుతున్నది. విజయ డెయిరీ రోజుకు 50వేల లీటర్ల  పాలను టెట్రా ప్యాకెట్లను అందించే చాన్స్​ ఉంది. దీని ద్వారా విజయ డెయిరీకి,  దానికి పాలు పోసే పాడి రైతులకు ఆదాయం సమకూరుతుంది.  విజయకు అవకాశం లేకుండా రోజుకు 3 లక్షల లీటర్లు, ఏడాదికి 3కోట్ల లీటర్ల టెట్రా ప్యాకింగ్‌‌ సామర్థ్యమున్న సంస్థలే టెండర్లలో పాల్గొనాలనే నిబంధనలు విజయకు శాపంగా మారాయి. ప్రోత్సహించాల్సిన విజయ డెయిరీని టెండర్లలోనే పాల్గొనే అర్హత లేకుండా చేయడంలో ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు తెలుస్తున్నది.

సర్కారు ఉత్తర్వుల ఉల్లంఘనలు

అంగన్‌‌ వాడీ కేంద్రాలకు పాలను అందించాలని 2018లో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అదే ఏడాది జీవో జారీ చేసింది. పాల సేకరణ, అంగన్‌‌ వాడీ సెంటర్లకు టెట్రాప్యాకింగ్‌‌ ద్వారా సరఫరా పారదర్శంగా ఉండేందుకు హాకాను నోడల్‌‌ ఏజెన్సీగా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ విజయ డెయిరీని ప్రోత్సహించేందుకు సంస్థ ఎంతవరకు సరఫరా చేస్తే అంతా తీసుకుని మిగతా పాలను వేరే ఫెడరేషన్స్‌‌ ద్వారా సేకరించాలని నిర్ణయించారు. తాజాగా ఈ నిబంధనలను విరుద్ధంగా కొత్త రూల్స్​తెచ్చి టెండర్లు పిలవడం విమర్శలకు తావిస్తోంది. విజయ డెయిరీ పోటీలోనే పాల్గొనకుండా టెండర్ రూల్స్ రూపొందించారు. సర్కారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం టెండర్లు పిలవాల్సిన హాకాను కాదని.. రూల్స్​కు విరుద్ధంగా ఐసీడీఎస్‌‌ నేరుగా టెండర్లకు పోవడం అనుమానాల్ని బలపరుస్తోంది.