
హనుమకొండ సిటీ, వెలుగు : రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కొన్ని పార్టీలు, అగ్రకుల పెద్దలు కుట్రలు చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. హనుమకొండలోని హరిత కాకతీయలో బుధవారం మీడియాతో మాట్లాడారు. బీసీలు సర్పంచ్‌లు కావొద్దనే రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గల్లీలో మద్దతు ఇస్తూ, ఢిల్లీలో అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు సిండికేట్‌గా మారాయన్నారు. బీసీలకు, మహిళలకు ప్రధాని మోదీ చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చి బీసీలను మోసం చేశారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకపోతే బీసీల తరఫున కొత్త రాజకీయ పార్టీ వస్తుందని స్పష్టం చేశారు.