సింగరేణి పరిహారం పేరిట రియల్టర్ల దందా 

సింగరేణి పరిహారం పేరిట రియల్టర్ల దందా 
  •        వ్యవసాయ భూముల్లో వెలుస్తున్న అక్రమ వెంచర్లు 
  •        నిర్మాణాలను పట్టించుకోని పంచాయతీ ఆఫీసర్లు 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా తాండూర్​ మండలంలో కొంతమంది రియల్టర్లు, ప్రజాప్రతినిధులు కలిసి నయా దందాకు తెరలేపారు. సింగేణి సంస్థ కొత్త ఓసీపీల కోసం గుర్తించిన వ్యవసాయ భూములను రియల్​ వెంచర్లుగా మారుస్తున్నారు. ఈ స్థలాలు ఓసీలో పోతే సింగరేణి రూ. లక్షల్లో పరిహారం చెల్లిస్తుందని అమాయకులను మభ్యపెట్టి అందినంత దోచుకుంటున్నారు. తాండూర్​ మండలంలోని ఎంవీకే3, ఎంవీకే 5, పోచంపల్లి ప్రాంతాల్లో కొద్దిరోజులుగా ఈ దందా జోరుగా సాగుతోంది. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి, మాదారం ప్రాంతాల్లో మూతపడ్డ అండర్​గ్రౌండ్ మైన్ల స్థానంలో గోలేటి ఓసీపీ ఏర్పాటుకు సింగరేణి చర్యలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. దీన్ని ఆసరాగా చేసుకొని ఓసీపీ ప్రతిపాదిత ప్రాంతాల్లోని వ్యవసాయ భూములను కొనుగోలు చేసి రియల్​ వెంచర్లు చేస్తున్నారు. పర్మిషన్లు లేకుండానే గుంట, రెండు గుంటల చొప్పున విక్రయిస్తున్నారు. సిమెంట్​ ఇటుకలు, రేకులతో తాత్కాలిక ఇండ్లు కట్టి రూ.3 లక్షల చొప్పున అమ్ముతున్నారు. ఇప్పటికే గ్రామ శివారులో గల 62/4 సర్వేనంబర్​లోని సుమారు నాలుగు ఎకరాల్లో ఓ కాలనీ ఏర్పడింది.

రూ.10లక్షలు పెట్టుబడి... రూ.60లక్షల

దోపిడీ ఓసీపీ ప్రతిపాదనలతో మాదారం 3 ఇంక్లైన్​ ప్రాంతంలోని భూములకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. రియల్టర్లు వ్యవసాయ భూములను ఎకరం రూ.10 లక్షలకు కొనుగోలు చేసి రూ.3లక్షలకు రెండు గుంటల చొప్పున అమ్ముతున్నారు. ఈ లెక్కన ఎకరానికి రూ.60 లక్షలు దండుకుంటున్నారు. ఓసీపీలో పోయిన ఇండ్లకు సింగరేణి పరిహారం చెల్లిస్తుందని, ఫ్యామిలీలో ఒకరికి కాంట్రాక్ట్​ జాబ్​ ఇస్తుందని, ఆర్​అండ్​ఆర్​ ప్యాకేజీ కింద ఇతర బెనిఫిట్స్​ వస్తాయని నమ్మబలుకుతున్నారు. హౌజ్​ ​నంబర్లు, కరెంటు మీటర్లు కూడా ఇప్పిస్తామని చెపుతున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పేద, మధ్య తరగతి ప్రజలు పరిహారం ఆశతో ఇండ్లను కొంటున్నారు. 

కొత్త కట్టడాలకు పరిహారం రాదు... 

ఇంతకుముందు మండలంలోని పోచంపల్లిలో ఇదే రీతిలో ఇండ్లు కట్టి అమ్మారు. ఈ విషయం సింగరేణి అధికారుల దృష్టికి వెళ్లడంతో కొత్త కట్టడాలకు ఎలాంటి పరిహారం రాదని స్పష్టం చేశారు. అప్పటి గోలేజీ జీఎం సంజీవరెడ్డి ఈ ప్రాంతంలో ఓసీపీ ప్రారంభించడం కోసం ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిందని, కావున నాలా కన్వర్షన్, లేఅవుట్​ పర్మిషన్లు ఇవ్వరాదని కలెక్టర్​కు మొమోరాండం అందజేశారు. అలాగే ఎంవీకే 3, ఎంవీకే -5, పోచంపల్లి, వడ్డెరకాలనీలను ప్రాంతాలను సందర్శించి వాటిని కోల్ బేరింగ్ ఏరియాలుగా గుర్తించామని, అక్రమ నిర్మాణాలకు సింగరేణి యాజమాన్యం ఎలాంటి పరిహారం చెల్లించదని, దళారుల మాటలు నమ్మి నష్టపోవద్దని ప్రజలకు సూచించారు. దీంతో పోచంపల్లి గ్రామంలో రియల్ దందా ఆగిపోవడంతో ఎంవీకే 3, ఎంవీకే 5 ఏరియాలను ఎంచుకున్నారు. కొత్త కట్టడాలకు ఎలాంటి పరిహారం రాదని సింగరేణి అధికారులు స్పష్టం చేసినప్పటికీ ఈ అక్రమ దందా మాత్రం ఆగడం లేదు. 

గుంటల్లో రిజిస్ర్టేషన్లు చేయడం వల్లే....

రెవెన్యూ అధికారులు ధరణి పోర్టల్​ ద్వారా వ్యవసాయ భూములను గుంటల లెక్క రిజిస్ర్టేషన్లు చేస్తున్నారు. ఒకే సర్వేనంబర్​లో గుంట, రెండు గుంటల చొప్పున రిజిస్ర్టేషన్లు చేసి పట్టా పాస్​బుక్​లు ఇస్తున్నారు. ఈ రిజిస్ర్టేషన్లు అక్రమ వెంచర్ల కోసమేనని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. రియల్టర్లు ఒక్కో ప్లాట్​కు రూ.5వేల వరకు ముడుపులు ముట్టచెపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీ అధికారుల కండ్ల ముందే ఎకరాల విస్తీర్ణంలో కాలనీలు వెలుస్తున్నా చూసీచూడనట్టు ఉంటున్నారు. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్​ను ఫోన్​ చేయగా.. స్విచ్ఛాఫ్​ ఉంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ దందాకు చెక్​ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. కాగా, నిరుడు శ్రీరాంపూర్​ ఓసీపీ ఎక్స్​టెన్షన్​లో భాగంగా జైపూర్​ మండలం దుబ్బపల్లిలో లింగన్నపేట పేరిట కొత్త కాలనీ వెలిసింది. ఈ అక్రమాలను 'వీ6 వెలుగు' బయటపెట్టడంతో సింగరేణి, రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఇండ్లను కూల్చేశారు.