ఎంపీ నామా కొడుకుపై దాడి

ఎంపీ నామా కొడుకుపై దాడి
  • కారును అడ్డగించి అందులోకి ఎక్కిన దుండగులు 
  • కత్తితో బెదిరించి రూ. 75 వేలు ఆన్​లైన్ ట్రాన్స్ ఫర్ 
  • పంజాగుట్ట పీఎస్​లో కేసు నమోదు 
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన 

ఖైరతాబాద్ ,వెలుగు :  టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు కారును అడ్డగించిన కొందరు దుండగులు అందులోకి ఎక్కి అతనిపై దాడి చేశారు. కత్తితో బెదిరించి రూ. 75 వేలు ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు నామా పృథ్వీతేజ బిజినెస్​మన్. జూబ్లీహిల్స్​లో ఉంటున్నాడు. శనివారం (జులై 30వ తేదీన) రాత్రి టోలిచౌకిలో ఉంటున్న తన ఫ్రెండ్ ను కలిసేందుకు కారులో వెళ్లాడు. ఇద్దరు వ్యక్తులు టోలిచౌకి వద్ద పృథ్వీ తేజ కారుకు బైక్​ను అడ్డం పెట్టి ఆపారు. వెంటనే కారులోకి బలవంతంగా ఎక్కారు. డ్రైవింగ్ సీటులో ఉన్న పృథ్వీ మెడపై కత్తి పెట్టి కొండాపూర్ వైపు కారును పోనివ్వాలంటూ బెదిరించారు. 

కొంతసేపటి తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు కారులోకి ఎక్కారు. గచ్చిబౌలిలోని ఓ వైన్స్ వద్ద కారును ఆపి మద్యం తాగారు. అక్కడి నుంచి కొండాపూర్ వెళ్తుండగా మరో వ్యక్తి కారులో ఎక్కాడు. అందరూ కలిసి పృథ్వీపై పిడిగుద్దులతో దాడి చేశారు. గొంతుపై కత్తి పెట్టి రూ. 75 వేలు ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. ఆ తర్వాత గచ్చిబౌలి నుంచి టోలిచౌకి, మెహిదీపట్నం, ఖైరతాబాద్, రాజ్ భవన్ మీదుగా ఎస్ఆర్ నగర్ కు తీసుకొచ్చారు. ఎస్ఆర్ నగర్ లో ఆగి ఉన్న ఓ బైక్ ను కారు ఢీకొట్టింది. ఎస్ఆర్ నగర్ నుంచి మళ్లీ టోలిచౌకికి వెళ్తుండగా.. పంజాగుట్ట నుంచి నిమ్స్ మధ్యలో కారులోంచి దూకి పృథ్వీ తప్పించుకున్నాడు. వెంటనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పరుగెత్తాడు. తనపై జరిగిన దాడిని వివరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.