కేసీఆర్​ అవినీతిలో రాష్ట్రాన్ని నంబర్ వన్ చేసిన్రు : సోము వీర్రాజు

    కేసీఆర్​ అవినీతిలో రాష్ట్రాన్ని నంబర్ వన్ చేసిన్రు : సోము వీర్రాజు

ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు

యాదగిరిగుట్ట, వెలుగు : అభివృద్ధి పేరుతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అవినీతిలో నంబర్ వన్ గా చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి ముసుగులో రాష్ట్ర సంపదను కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు ధారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో బీజేపీ మండల అధ్యక్షుడు కొక్కొండ లక్ష్మీనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బీజేపీ మండలస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లలో సీఎం కేసీఆర్ అసమర్థ, అవినీతి పాలన పట్ల ప్రజలు విసుగు చెందారన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో.. నీళ్ల పేరుతో  నిధులను వెనకేసుకున్న కేసీఆర్, ఉద్యోగాల భర్తీ చేయకుండా తన కుటుంబ సభ్యులకు మాత్రం రాజకీయ ఉద్యోగాలు ఇప్పించుకున్నారని మండిపడ్డారు.  రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందన్నారు. ఆలేరు సహా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. వచ్చే 50 రోజులు పార్టీ క్యాడర్ గ్రౌండ్ లెవల్ లో గట్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదగాని హరిశంకర్ గౌడ్, పడాల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవుల నరేందర్, తుర్కపల్లి సర్పంచ్ పడాల వనిత శ్రీనివాస్, ఆలేరు అసెంబ్లీ కన్వీనర్​ శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి దొంకెన రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకుల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాస్ ఉన్నారు.