- మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతానగర్ లో ఘటన
పాపన్నపేట, వెలుగు: డబ్బుల కోసం గొడవ పడి తండ్రిని కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామానికి చెందిన లంగాడి లక్ష్మయ్య(48) వ్యవసాయంతో పాటు ఓ లైన్ మన్ వద్ద విద్యుత్ పనులు చేస్తున్నాడు. అతనికి భార్య శేఖమ్మ, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
పెద్ద కొడుకు శ్రీకాంత్ వివాహానికి, వ్యవసాయానికి కొంత అప్పులు అయ్యాయి. శ్రీకాంత్, లక్ష్మయ్య మధ్య తరచూ డబ్బుల విషయంలో గొడవ జరిగేది. డబ్బులు ఇవ్వకపోతే చంపుతానంటూ తరచూ శ్రీకాంత్ తండ్రిని బెదిరించేవాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి లక్ష్మయ్య ఇంటికి రాగానే శ్రీకాంత్ డబ్బులు అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
శ్రీకాంత్ ఆవేశంతో సుత్తితో తండ్రిపై దాడి చేయగా, తల్లి దానిని లాక్కోవడంతో పక్కనే ఉన్న కర్రతో లక్ష్మయ్య తలపై కొట్టాడు. తీవ్రగాయాలైన లక్ష్మయ్యను మెదక్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
