ఆస్తి కోసం చిన్నమ్మను చంపిండు

V6 Velugu Posted on May 06, 2021

హసన్​పర్తి, వెలుగు: ఆస్తి కోసం జరిగిన గొడవలో క్షణికావేశంతో చిన్నమ్మ తల పగలగొట్టి హత్య చేసిన ఘటన వరంగల్​ అర్బన్ ​జిల్లా హసన్​పర్తి మండలం పెంబర్తిలో జరిగింది. ఎస్సై జితేందర్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నూటెంటకి కనకయ్య రిటైర్డ్ ​సింగరేణి ఎంప్లాయ్. ఇతనికి ఇద్దరు భార్యలు ప్రమీల, విజయ. వీళ్లిద్దరూ సొంత అక్కా చెల్లెళ్లు కూడా. మొదటి భార్య ప్రమీలకు ఇద్దరు కొడుకులు వేణుగోపాల్, గౌరీశంకర్, ఒక కూతురు ఉన్నారు. రెండో భార్య విజయకు భాస్కర్​ అనే కొడుకు ఉన్నాడు. నల్లబెల్లిలోని తన అమ్మగారి ఊర్లోని ఆస్తి అమ్మగా వచ్చిన మొత్తంలో తనకూ వాటా కావాలని వేణుగోపాల్ ​మంగళవారం రాత్రి చిన్నమ్మ విజయతో గొడవపడ్డాడు. కోపంలో రోకలిబండతో విజయ తలపై కొట్టాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే ఉన్న తల్లిదండ్రులు కనకయ్య, ప్రమీల గట్టిగా అరవడంతో వేణుగోపాల్ అక్కడి నుంచి పరారయ్యాడు. భాస్కర్​ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పరకాలలో తల్లిని.. 
పరకాల, వెలుగు: తనతో లిక్కర్ మాన్పించేందుకు ఆయుర్వేద మందులు తినిపించిందనే అనుమానంతో తల్లిని దారుణంగా హత్య చేశాడో కొడుకు. అడ్డొచ్చిన తండ్రి, చెల్లిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన వరంగల్​ రూరల్​జిల్లా పరకాల టౌన్​లో జరిగింది. ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక వికాస్ నగర్ లో ఉండే తోర్నే రవి, పద్మ దంపతుల కొడుకు రమేశ్, కూతురు నీరజ. లిక్కర్​కు బానిసైన రమేశ్ ​కొద్దిరోజులుగా ఆస్తి కోసం తల్లిదండ్రులతో గొడవపడుతున్నాడు. తనతో మద్యం మాన్పించేందుకు తల్లి ఆయుర్వేద మందులు తినిపించిందనే అనుమానంతో రమేశ్​ ఈ నెల 3వ తేదీన కత్తితో తల్లిని పొడిచి చంపాడు. అడ్డొచ్చిన తండ్రి, చెల్లిపై కత్తితో దాడి చేయడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వాళ్లిద్దరూ ప్రస్తుతం హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారు. రమేశ్​ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరకాల ఇన్​స్పెక్టర్​మహేందర్​రెడ్ది ఆధ్వర్యంలో గాలించి రమేశ్​ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

Tagged murder, Hasanparthi murder, son killed his second mother, warangal murder

Latest Videos

Subscribe Now

More News