ఎమ్మెల్యే కొడుకు వర్సెస్ గిడ్డంగుల సంస్థ చైర్మన్

ఎమ్మెల్యే కొడుకు వర్సెస్ గిడ్డంగుల సంస్థ చైర్మన్
  • దాడి ఘటన మరవకముందే సాయిచంద్ బర్త్‌‌‌‌డే పోస్టర్ల చించివేత 
  • గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ తొలగింపుతో రాజుకున్న రాజకీయం
  • మంత్రి సపోర్ట్‌‌‌‌తోనే సాయిచంద్‌‌‌‌ అలంపూర్‌‌‌‌‌‌‌‌లో పర్యటిస్తున్నట్లు విమర్శలు

గద్వాల, వెలుగు:  అలంపూర్‌‌‌‌‌‌‌‌ టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో వర్గపోరు తారస్థాయి చేరింది. పార్టీకి చెందిన ఆశావహ నేతలు బహిరంగంగానే  కొట్లాటలకు దిగుతున్నారు.  వజ్రోత్సవాల్లో భాగంగా నాలుగురోజుల క్రితం శాంతినగర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌‌‌లో ఎమ్మెల్యే అబ్రహం కొడుకు అజయ్‌‌‌‌ అనుచరులు గోడౌన్స్‌‌‌‌ కార్పొరేషన్ చైర్మన్‌‌‌‌ సాయిచంద్‌‌‌‌పై దాడి చేసిన విషయం తెలిసింతే.  దీనికి కొనసాగింపు అన్నట్లుగా సోమవారం రాత్రి సాయిచంద్‌‌‌‌ బర్త్‌‌‌‌డే పోస్టర్లను చించివేశారు.  మంగళవారం సాయింద్ చంద్‌‌‌‌ బర్త్‌‌‌‌డే కావడంతో ఆయన అనుచరులు ఒకరోజు ముందుగానే అలంపూర్, శాంతినగర్, అలంపూర్ చౌరస్తాల్లో వాల్‌‌‌‌ పోస్టర్లను అంటించారు. వీటిని అపోజిట్ వర్గానికి చెందిన వ్యక్తులు రాత్రికి రాత్రే చించివేయడం చర్చనీయాంశంగా మారింది.  

టీఆర్ఎస్ లీడర్ల హౌస్ అరెస్ట్!

సాయిచంద్ బర్త్‌‌‌‌డే వేడుకలకు రాకుండా కొందరు టీఆర్ఎస్ లీడర్లను హౌస్ అరెస్ట్ చేశారని పార్టీలోని ఒక వర్గం వారు ఆరోపిస్తున్నారు.  కర్నూల్‌‌‌‌లో నివాసం ఉంటున్న ఉండవల్లి జడ్పీటీసీ కొడుకు తేజ సాయిచంద్‌‌‌‌ బర్త్‌‌‌‌డేకు వచ్చేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ, తెల్లవారుజామున మఫ్టీలో వెళ్లిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం. ఒక లీడర్ ప్రోద్బలంతో మరికొంత మందిని కూడా బర్త్‌‌‌‌డేకు వెళ్తే బాగుండదని బెదిరించినట్లు తెలిసింది.

గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ను తొలగించడంతోనే..

గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌గా ఉన్న అలంపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన పటేల్‌‌‌‌ విష్ణువర్ధన్‌‌‌‌ రెడ్డిని తొలగించి.. హైకమాండ్ గద్వాల నియోజకవర్గానికి చెందిన జంబు రామన్ గౌడ్‌‌‌‌కు పదవి ఇవ్వడంతో రాజకీయం ముదిరినట్లు ప్రచారం జరుగుతోంది.  ఇతను జిల్లా ఇన్‌‌‌‌చార్జి మంత్రికి అనుచరుడు కావడం, కొన్నాళ్లుగా ఇద్దరు ఎమ్మెల్యేలు, మంత్రికి పడకపోవడం ఇతని తొలగింపుకు కారణంగా తెలుస్తోంది. దీంతో మంత్రి తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు గోడౌన్స్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ సాయి చంద్‌‌‌‌ను రంగంలోకి దింపారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

పెరుగుతున్న ఆశావహుల సంఖ్య

అలంపూర్ టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సిట్టింగ్ స్థానమైనప్పటికీ ఆశావహుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉన్నది.  టికెట్ కోసం ఇప్పటికే ఐదుగురు నేతలు పైరవీలు చేసుకుంటున్నట్లు తెలిసింది. గ్రూప్ రాజకీయాలు చేస్తూ ఎవరికి వారే ప్రోగ్రామ్స్‌‌‌‌ చేస్తున్నారు.  ఇందులో ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ బండారి భాస్కర్, మాజీ ఎంపీ మందా జగన్నాథం కొడుకు మంద శ్రీనాథ్, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ యువజన విభాగానికి చెందిన ఓ లీడర్‌‌‌‌తో పాటు  జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ వర్గానికి చెందిన ఓ నేత ఉన్నారు.  తాజాగా గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్‌‌‌‌ సైతం నెలరోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.  సాయిచంద్‌‌‌‌కు హైకమాండ్‌‌‌‌తో మంచి సంబంధాలు ఉండడంతో ఎక్కడ తమకు టికెట్ రాకుండా పోతుందోనని ఎమ్మెల్యే వర్గీయులే పోస్టర్లు కూడా చించివేశారని ఆరోపణలు ఉన్నాయి.   

వాల్ పోస్టర్లు చించడం అవివేకం

అలంపూర్, వెలుగు: తన బర్త్‌‌‌‌డేకు సంబంధించిన వాల్ పోస్టర్లు చించడం అవివేకమని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ అన్నారు. మంగళవారం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో  సాయిచంద్‌‌‌‌ మిత్రమండలి ఆధ్వర్యంలో కేక్‌‌‌‌ కట్ చేసి.. బర్త్‌‌‌‌డే జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మీద కోపంతో పోస్టర్లు చించిన వారు సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌, మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌తో పాటు ఉమ్మడి జిల్లా మంత్రులు,  స్థానిక ఎమ్మెల్యే అబ్రహం ఫొటో ఉందన్న సంగతి మర్చిపోయారని విమర్శించారు.  ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ టికెట్‌‌‌‌పై స్పందిస్తూ రాష్ట్రంలోని  నియోజకవర్గాల్లో అభ్యర్థులెవరున్నా కేసీఆరే తమ నాయకుడని స్పష్టం చేశారు.