
- కొడుకు మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన రాణి కపూర్
- ఏజీఎంను రెండు వారాలు వాయిదా వేయాలని బోర్డుకు లేఖ
- షెడ్యూల్ ప్రకారమే జరిగిన మీటింగ్
న్యూఢిల్లీ: చైర్మన్ సంజయ్ కపూర్ మరణం తర్వాత సోనా గ్రూప్‌లో ఆధిపత్య పోరు నెలకొంది. కొందరు కపూర్ కుటుంబానికి చెందిన వారమంటూ డైరెక్టర్లుగా నియమితులయ్యారని ఆయన తల్లి రాణి కపూర్ తాజాగా ఆరోపణలు చేశారు. కొడుకు పోయిన బాధలో ఉన్నానని, యాన్యువల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం)ను రెండు వారాలపాటు వాయిదా వేయాలని కంపెనీ బోర్డుకు లేఖ రాశారు. అయినప్పటికీ షెడ్యూల్ ప్రకారమే బోర్డు మీటింగ్ జరిగింది.
రాణి కపూర్ ఈ నెల 24న బోర్డుకు రాసిన లేఖలో, కుటుంబం సంజయ్ మరణం వల్ల దుఖంలో ఉండగా, కొందరు కుటుంబ వారసత్వాన్ని కైవసం చేసుకునేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. సంజయ్ మరణం "అనుమానాస్పదంగా”ఉందని ఆమె అన్నారు. తాను ఎవరినీ బోర్డుకు నామినేట్ చేయలేదని పేర్కొన్నారు. "ఏఈజీఎంలో కపూర్ కుటుంబ ప్రతినిధులుగా డైరెక్టర్ల నియామక రిజల్యూషన్ ఉందని సమాచారం. కానీ నాతో ఎటువంటి చర్చ జరగలేదు" అని ఆమె తెలిపారు.
కంపెనీ ఏజీఎం నోటీసు ప్రకారం, సంజయ్ భార్య ప్రియా సచ్‌దేవ్ కపూర్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించే రిజల్యూషన్ ఉంది. తన భర్త వీలునామా ద్వారా తాను సోనా గ్రూప్‌లో ప్రధాన షేర్‌హోల్డర్‌గా ఉన్నానని, కొందరు తమను కుటుంబ ప్రతినిధులుగా చెప్పుకుంటున్నారని రాణి కపూర్ ఆరోపించారు. సంజయ్ మరణం తర్వాత భావోద్వేగ స్థితిలో తనను బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకం చేయించారని, వాటి వివరాలు తనకు వెల్లడించలేదని ఆమె పేర్కొన్నారు. కాగా, సంజయ్ జూన్ 12న లండన్‌లో పోలో ఆడుతూ మరణించారు. తేనెటీగను మింగేయడంతో గుండె పోటువచ్చి చనిపోయారని వార్తలు వచ్చాయి.