సౌత్ క్వీన్ జ్యోతిక, బాలీవుడ్ భామ సోనాక్షీ సిన్హా లీడ్ రోల్స్‌లో నటించిన హిందీ లీగల్ డ్రామా ‘సిస్టమ్’ (System). టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వినీ అయ్యర్ తివారీ అద్భుతమైన విజన్‌తో తెరకెక్కించిన ఈ క్రైమ్ అండ్ కోర్ట్ డ్రామా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో మే 22 నుంచి స్ట్రీమ్ అవుతోంది. హిందీతో పాటుగా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో హయ్యెస్ట్ వ్యూస్తో దూసుకెళ్తోంది.
ఈ కథ పూర్తిగా భిన్నమైన సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన ఇద్దరు మహిళల చుట్టూ తిరుగుతుంది. సోనాక్షి సిన్హా ‘నేహా రాజవంశ్’ అనే ధైర్యవంతమైన, ఉన్నత స్థాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. మరోవైపు, జ్యోతిక ‘సారికా రావత్’ అనే కోర్ట్‌రూమ్ స్టెనోగ్రాఫర్‌గా, సాధారణ మరియు నియంత్రిత జీవితం గడిపే మహిళగా పవర్ ఫుల్ పాత్ర పోషించింది. అధికారం, హోదా, సమాజంలో ఉండే అసమానతలు న్యాయాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే పాయింట్‌ను ఇందులో దర్శకురాలు అద్భుతంగా చూపించారు.
అధికారం, డబ్బు, వ్యక్తిగత ఆశయాల మధ్య నలిగిపోయే ఓ ఛాలెంజింగ్ కేస్‌ను ఆమె ఎలా డీల్ చేసిందనేది ఆసక్తికరం. మరోవైపు సామాన్య జీవితం గడిపే ఓ షార్ప్ అండ్ రిసోర్స్‌ఫుల్ కోర్ట్ స్టెనోగ్రాఫర్ ‘సారిక’ పాత్రలో జ్యోతిక నటించింది. నేహాకు తోడుగా నిలిచి, తనదైన శైలిలో న్యాయం కోసం పోరాడే పాత్రలో జ్యోతిక స్క్రీన్ ప్రెజెన్స్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. ఈ క్రమంలోనే కోర్ట్ రూమ్ లో నడిచే వాదనలకు ఆడియన్స్ ఎంగేజ్ అవుతున్నారు. ఒకరిపై ఒకరు సంధించే ప్రశ్నలకు ఆసక్తిరేకేత్తిస్తున్నాయి. అన్యాయంపై ఆశయం సాధించిన విజయమే ఈ ‘సిస్టమ్’.
It’s time we find out what justice means to you. #SystemOnPrime, Watch Now https://t.co/zr7IaMulMI#SonakshiSinha #Jyotika @AshGowariker @bawejastudios #PammiBaweja #HarmanBaweja @Smithabaliga1 @ashwinyiyer @Taslok #AkshatGhildial pic.twitter.com/XsxCXywbkO
— prime video IN (@PrimeVideoIN) May 21, 2026
కథేంటంటే:
నేహా రాజ్‌వంశ్ (సోనాక్షి సిన్హా) ఒక ఉన్నత కుటుంబానికి చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్. తండ్రి రవి రాజ్‌వంశ్ (అశుతోష్ గోవారికర్) దేశంలోనే అత్యంత ధనవంతుల తరఫున వాదించే టాప్ డిఫెన్స్ లాయర్. అన్న కూడా లాయరే. ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభిస్తున్న నేహా తన తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి, సొంతంగా తన టాలెంట్‌ని నిరూపించుకోవాలి అనుకుంటుంది. అప్పుడే రవి ఆమెకు ఒక సవాల్ విసురుతాడు. వరుసగా 10 కేసులు గెలిస్తేనే ఫ్యామిలీ చాంబర్‌లో పార్ట్‌నర్‌గా చేర్చుకుంటానని చెప్తాడు. దాంతో ఆమె ఎలాగైనా కేసులు గెలిచి తండ్రి అహంకారాన్ని తగ్గించాలి అనుకుంటుంది. ఈ ప్రయాణంలో కోర్టు వ్యవహారాలు, వ్యవస్థలోని లోపాలపై పూర్తి అవగాహన ఉన్న కోర్టు స్టెనోగ్రాఫర్ సారికా రావత్ (జ్యోతిక) నేహాకు అండగా నిలుస్తుంది. అయితే, నేహా కెరీర్‌ను మలుపు తిప్పే పదో కేసులో మాత్రం తన తండ్రికే ఎదురు నిలవాల్సి వస్తుంది. సమాజంలో బాగా పలుకుబడి ఉన్న ఒక బిల్డర్ కోసం రవి వాదిస్తుంటే, అసలైన బాధితులకు న్యాయం చేసేందుకు నేహా పోరాడుతుంది. ఒకవైపు నైతిక విలువలు, మరోవైపు తండ్రితో సవాలు.. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ నేహా ఆ కేసు గెలిచిందా? లేదా? తెలియాలంటే సిరీస్ చూడాలి.
ఎలా ఉందంటే:
సిస్టమ్ ఒక కోర్ట్‌రూమ్ లీగల్ డ్రామాగా మాత్రమే కాకుండా, న్యాయవ్యవస్థలోని లోపాలు, అధికారం ప్రభావం, మహిళల పోరాటం వంటి అంశాలను బలంగా చూపించే ప్రయత్నం చేసింది. దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారీ కథను కేవలం కేసులు–కోర్టుల చుట్టూ తిప్పకుండా, పాత్రల భావోద్వేగాలు మరియు వారి వ్యక్తిగత సంఘర్షణలను కూడా బలంగా చూపించారు.
కథలో నేహా రాజవంశ్ పాత్ర కేవలం ఒక లాయర్ కాదు. తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని తపించే యువతి. కుటుంబ పేరు, వారసత్వం కాకుండా తన ప్రతిభతో ఎదగాలని ఆమె పడే తపన చాలా మందికి కనెక్ట్ అవుతుంది. వరుసగా కేసులు గెలిచి తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనే పట్టుదల కథకు ప్రధాన బలం. కానీ చివరికి అదే ప్రయాణం ఆమెను తండ్రికే ఎదురు నిలిచే పరిస్థితికి తీసుకెళ్తుంది.
ఇక సారికా రావత్ పాత్రలో జ్యోతిక నటన సిరీస్‌కు పెద్ద ప్లస్. సాధారణ కోర్ట్ స్టెనోగ్రాఫర్ పాత్రలా కనిపించినా, కథ ముందుకు వెళ్లేకొద్దీ ఆమె పాత్రలోని లోతు బయటపడుతుంది. వ్యవస్థలో ఉన్న లోపాలు, కోర్టు వ్యవహారాలపై ఆమెకు ఉన్న అవగాహన నేహాకు కీలకంగా మారుతుంది. జ్యోతిక తన కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్‌తో పాత్రకు జీవం పోశారు.
కోర్ట్‌రూమ్ సన్నివేశాలు సిరీస్‌కు హైలైట్‌గా నిలుస్తాయి. ప్రశ్నలు–సమాధానాలు, వాదనలు, భావోద్వేగాలు కథలో ఉత్కంఠను పెంచుతాయి. ముఖ్యంగా డబ్బు, అధికారం ఉన్నవారికి చట్టం ఎలా వంగుతుంది? సాధారణ ప్రజలు న్యాయం కోసం ఎంత పోరాడాలి? అనే ప్రశ్నలను సిరీస్ ముందుకు తెస్తుంది. మహిళల ఆత్మవిశ్వాసం, న్యాయం కోసం పోరాటం, అధికారం ముందు నిజం నిలబడగలదా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం. కోర్ట్‌రూమ్ డ్రామాలు ఇష్టపడే వారికి ఇది మంచి వాచ్.
