కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థనే ధిక్కరిస్తున్నది: సోనియా గాంధీ

 కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థనే ధిక్కరిస్తున్నది: సోనియా గాంధీ
  • చైనా బార్డర్​లో  ఏం జరుగుతోందో చెప్పాలె
  • కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ భేటీలో ప్రభుత్వానికి డిమాండ్​

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థనే ధిక్కరిస్తున్నదని, ఉన్న సమస్యలు చాలవన్నట్టు కొత్త ఇబ్బందులు తీసుకొస్తున్నదని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ విమర్శించారు. సుప్రీం కోర్టుతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. పార్లమెంట్​లోని సెంట్రల్ ​హాల్​లో పార్టీ ఎంపీలతో ఆమె భేటీ అయ్యారు. మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జ్యుడిషియల్ వ్యవస్థనే రద్దు చేసేందుకు పక్కా ప్లాన్​తో ముందుకు వెళ్తున్నదని విమర్శించారు. కేంద్రం తీరుతో న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోందని అన్నారు. మంత్రులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కూడా న్యాయ వ్యవస్థను విమర్శించడం దారుణమని విమర్శించారు. జ్యుడిషియల్ ​వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో అభాసుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. జడ్జీల నియామకం విషయంలో న్యాయశాఖ మంత్రి కిరణ్​ రిజుజు చేసిన కామెంట్లు బాధాకరమన్నారు. సుప్రీంకోర్టు ఎన్​జేఏసీ బిల్లును వ్యతిరేకించడంపై రాజ్యసభ చైర్మన్​ ధన్​కర్​ కూడా సీజేఐ ఎదుటే న్యాయ వ్యవస్థను కించపర్చేలా మాట్లాడారని గుర్తుచేశారు.

బార్డర్​ సమస్యపై పార్లమెంట్​లో చర్చించాలి

చైనా సరిహద్దులో ఏంజరుగుతుందో ప్రధాని హోదాలో ప్రజలందరికీ స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మోడీపై ఉందని సోనియా అన్నారు. పార్లమెంట్​లో కూడా ఈ అంశంపై చర్చించేందుకు అవకాశం ఇవ్వడంలేదని మండిపడ్డారు. చైనా చొరబాట్లపై ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్​ చేస్తే కేంద్రం నిరాకరించడం ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందని విమర్శించారు. దేశ రక్షణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కంటిన్యూగా చైనా ఆర్మీ ఇండియాలోకి చొచ్చుకువస్తుండటాన్ని కేంద్రం అంత సీరియస్​గా తీసుకోవడంలేదని తెలిపారు. బార్డర్​ వద్ద ఇండియన్​ ఆర్మీ ఎంతో ధైర్యంగా చొరబాట్లను తిప్పికొడుతున్నారని కొనియాడారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పార్టీ సీనియర్​ నేతలు పాల్గొన్నారు. తర్వాత పార్లమెంట్​లోని గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్ష పార్టీల లీడర్లు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సోనియా, ఖర్గే, చిదంబరం కూడా పాల్గొన్నారు.