అశోక్ గెహ్లాట్పై సోనియా గాంధీ ఆగ్రహం

 అశోక్ గెహ్లాట్పై సోనియా గాంధీ ఆగ్రహం

రాజస్థాన్ కాంగ్రెస్లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. ఆ రాష్ట్ర సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవనుండటంతో  ముఖ్యమంత్రిగా సచిన్ పైలెట్ను నియమించేందుకు పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తోంది. అయితే అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గెహ్లాట్ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మూకుమ్మడి రాజీనామా చేస్తామని బెదిరించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. తాజా పరిణామాల నేపథ్యంలో సోనియా గాంధీ, అశోక్ గెహ్లాట్ వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న తన వర్గ ఎమ్మెల్యేలకు నచ్చచెప్పకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాజస్థాన్లో తాజా పరిణామాల నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్ నేత కమల్ నాథ్ను రంగంలోకి దించింది. 

ఇదిలా ఉంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అశోక్ గెహ్లాట్ ను పార్టీ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి ను తప్పించాలని హైకమాండ్ కు సూచించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పగించడం మంచిదికాదని అభిప్రాయపడింది. పార్టీ అగ్రనాయకత్వం ఆయన అభ్యర్థిత్వంపై పునరాలోచించాలని సీడబ్ల్యూసీ సభ్యులు లేఖలో విజ్ఞప్తి చేశారు. గెహ్లాట్ కు బదులు మరొకరిని ఎంపిక చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్న అశోక్ గెహ్లాట్ రేపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో తాజా పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయన్నది హాట్ టాపిక్గా మారింది.